● ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు: ప్రముఖ కళాశాలలు, విశ్వ విద్యాలయాల పేరుతో ఫోన్‌కాల్స్, వాట్సప్ మెసేజ్‌లు, ఫేక్ వెబ్‌సైట్ల ద్వారా సంప్రదిస్తూ మేనేజ్‌మెంట్ కోటా సీట్ల పేరుతో అడ్వాన్స్ బుకింగ్ డబ్బులు అడిగి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఇంజినీరింగ్, మెడికల్, బీటెక్ పేరుతో అడ్మిషన్ గ్యారెంటీ, తక్కువ ఫీజుతో సీటు కల్పిస్తామంటూ అమాయక విద్యార్థులు, తల్లిదండ్రులను డబ్బులు అడిగి సైబర్ గాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో చోటు చేసుకున్నాయని, ఏ కళాశాల సీటు కోసమైనా అధికారిక సీటు వెబ్‌సైట్ లేదా కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫోన్ కాల్స్, సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఆఫర్లను నమ్మి డబ్బులు పంపి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత బ్యాంకు వివరాలు, ఓటీపీ వివరాలు ఎవరికి చెప్పకూడదన్నారు. అనుమానాస్పద లింకులు, ఏపీకే ఫైల్స్ డౌన్‌లోడ్ చేయవద్దని, ఎవరైనా అడ్మిషన్ గ్యారెంటీ పేరుతో మోసపోయి ఉంటే 1930 సైబర్ క్రైం హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.


