ఎమ్మిగనూరుటౌన్: ఎన్నికల ముందు చేనేత రంగాన్ని, దానిపై ఆధారపడిన కార్మికులను ఆదుకుంటానని నమ్మబలికిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పూర్తిగా విస్మరించాడు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నేతన్న నేస్తం కింద ఏటా అందే రూ. 24 వేల సాయాన్ని కూడా అటకెక్కించాడు. ఈ రెండేళ్లలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో నేతన్నల సంక్షేమానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంఘం (ఆప్కో) ఆర్థికంగా కుదేలైంది. అలాంటి ఈ సంస్థలోకి ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ (వైడబ్ల్యూసీఎస్)ని విలీనం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి. ఈ సొసైటీకి సంబంధించిన కోట్లాది రూపాయల ఆస్తులు కొల్లగొట్టేందుకే అధికారపార్టీ నాయకులు ఈ కుట్రకు తెరలేపారని స్థానిక చేనేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
వైడబ్ల్యూసీఎస్‌కు దేశంలోనే గుర్తింపు
ఎమ్మిగనూరులో చాలా మంది చేనేత కార్మికులు ఉన్నారు. వీరిని ఆదుకునేందుకు పద్మశ్రీ మాచాని సోమప్ప 1938 సంవత్సరంలోనే వైడబ్ల్యూసీఎస్‌ను స్థాపించారు. అప్పట్లో 60కిపైగా చేనేత వస్త్ర దుకాణాలను నడిపి 600 మందికి పైగా సభ్యులతో సొసైటీ నడిపారు. వైడబ్ల్యూసీఎస్ బ్రాండ్‌తోనే దుప్పట్లు, దోమతెరలు, టవళ్లు, చీరలు తదితర జనతా వస్త్రాలను ఉత్పత్తి చేయిస్తూ ఉమ్మడి తెలుగురాష్ట్రాలతో పాటు కర్ణాటకలో చేనేత వస్త్ర దుకాణాలు నెలకొల్పి సొసైటీని లాభాల బాటలో నడిపించారు. ఇలా ఎమ్మిగనూరు చేనేత వస్త్రాలకు దేశ వ్యాప్తంగా గుర్తింపు రావడంతో రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, దేశ ప్రధానులు, ముఖ్యమంత్రులు సొసైటీని సందర్శించారు. ఇప్పటికీ లాభాల్లో నడుస్తున్న వైడబ్లూసీఎస్‌కు ఎమ్మిగనూరులో కోట్లాది రూపాయల విలువైన దుకాణాలు, భవనాలు, భూములున్నాయి. అలాంటి సొసైటీని నష్టాల ఆప్కోలో విలీనం చేసేందుకు ప్రతిపాదన చేయడం వెనుక ఏదో పెద్ద మతలబు ఉందని సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు.
జనవరిలోనే ప్రతిపాదనలు
ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీకి ఎమ్మిగనూరు పరిధిలోని 12 డిపోలు, అవుట్‌లెట్‌లు తెలంగాణలోని 1, కర్ణాటకలోని మూడు అవుట్‌లెట్లను ఆప్కోలో విలీనం చేసేందుకు ప్రతిపాదిస్తున్నట్లు గత జనవరి నెలలో అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఆదేశాలతో ఓ అధికారి హ్యాండ్‌లూమ్స్ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. చేనేత పరిశ్రమ, చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్, బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేందుకే విలీన ప్రతిపాదనలు అని అధికారులు చెబుతున్నారు. ఇదే వాస్తవమైతే సొసైటీలోని మెజారిటీ సభ్యులతో విలీన అంశంపై ఎందుకు చర్చించలేదని పలువురు చేనేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 31న జరిగే జనరల్ బాడీ సమావేశంలో సొసైటీ విలీన ఆమోదాన్ని వ్యతిరేకించాలని మెజార్టీ సభ్యులు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
కోట్లాది రూపాయల ఆస్తులను
కొట్టేసేందుకే ఈ ఎత్తుగడ
31న సొసైటీ జనరల్ బాడీ
సమావేశంలో ఆమోదానికి ప్రతిపాదన
విలీనాన్ని వ్యతిరేకించాలని వైడబ్ల్యూసీఎస్ సభ్యులు నిర్ణయం


