కుట్టు శిక్షణ! | - | Sakshi
Sakshi News home page

కుట్టు శిక్షణ!

Mar 29 2026 7:01 AM | Updated on Mar 29 2026 7:01 AM

శిక్షణ పొందిన వారి వివరాలు

జిల్లాల వారీగా ...

సంఖ్య మహిళలు

కర్నూలు(అర్బన్‌): గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని బీసీ, ఈబీసీ తదితర సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉద్దేశించిన ఉచిత కుట్టు శిక్షణ ప్రహసనంగా మారింది. ఈ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్‌తో పాటు ఉచితంగా కుట్టు మిషన్‌ను అందిస్తామని చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో భారీగా ప్రచారాలు నిర్వహించి కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బీసీ, ఈబీసీ కులాలతో పాటు కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, బలిజ కులాలకు చెందిన వేల మంది మహిళలు కుట్టు శిక్షణను పూర్తి చేసుకున్నారు. సీయుఆర్‌డీ (సెంటర్‌ ఫర్‌ అర్బన్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ), ఎస్‌ఏపీఈ (సోషల్‌ ఏజెన్సీ ఫర్‌ పీపుల్స్‌ ఎంపవర్‌మెంట్‌) సంస్థల ఆధ్వర్యంలో శిక్షణా కేంద్రాలను నిర్వహించారు. గత ఏడాది ఏప్రిల్‌ 15వ తేది నుంచి ప్రారంభమైన శిక్షణ ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో పూర్తి అయింది. ఒక్కో కేంద్రంలో రెండు బ్యాచ్‌ల ప్రకారం శిక్షణను ఇచ్చారు. 45 రోజుల నుంచి 90 రోజుల్లోగా మొత్తం 360 గంటలు శిక్షణ తీసుకోవాల్సి ఉందని, 75 శాతం హాజరు ఉంటేనే ఉచితంగా కుట్టు మిషన్‌, సర్టిఫికెట్‌ అందిస్తామని అప్పట్లో ప్రకటించారు. శిక్షణ పూర్తి అయిన వెంటనే కుట్టు మిషన్‌తో పాటు సర్టిఫికెట్‌ను అందిస్తారనే నమ్మకంతో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఆరు వేల మందికి పైగా మహిళలు ఆయా కేంద్రాలకు వెళ్లి కుట్టు శిక్షణ పొందారు. అయితే శిక్షణ పూర్తి చేసుకొని ఆరేడు నెలలు గడచిపోయినా నేటికీ కుట్టు మిషన్ల గురించి ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు.

తాజాగా పరీక్ష, రూ.600 చెల్లించాలని మెలిక!

ఉమ్మడి జిల్లాలోని ఆయా కేంద్రాల్లో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు మిషన్లు అందించాలంటే, తప్పక తాము నిర్వహించే పరీక్ష పాస్‌ కావాలని, అలాగే ఒక్కో అభ్యర్థి రూ.600 చెల్లించాలని మెలిక పెట్టినట్లు మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం కర్నూలులోని శిక్షణ కేంద్రానికి శిక్షణ తీసుకున్న దాదాపు నలభై, యాభై మంది మహిళలు వచ్చి పరిపరి విధాలుగా ప్రశ్నించారు. గ్రామాలు, పట్టణాల్లోని కేంద్రాలకు రెగ్యులర్‌గా వచ్చి శిక్షణ తీసుకునేందుకు ప్రతి రోజు అప్పట్లో బస్సు, ఆటో చార్జీలకు కనీసం రూ.100 వరకు ఖర్చు చేసుకున్నామని వారంటున్నారు. గతంలో చెప్పిన విధంగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికేట్‌తో పాటు కుట్టు మిషన్‌ను అందించాల్సి ఉండగా, ఇప్పుడు పరీక్ష నిర్వహిస్తామని, అందుకు రూ.600 చెల్లించాలని చెప్పడం ఏమిటని వారు నిలదీస్తున్నారు. తాము చెల్లించే డబ్బులకు ఎవరు గ్యారెంటీ ఉంటారని ప్రశ్నిస్తున్నారు. ముందుగానే శిక్షణ పూర్తి అయిన అనంతరం పరీక్ష ఉంటుందని, ఫీజు రూ.600 చెల్లించాల్సి ఉంటుందని ఎందుకు చెప్పలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్రైనర్‌, డిజిటల్‌ అసిస్టెంట్లకు అందని వేతనాలు

ఉమ్మడి జిల్లాలోని 47 కేంద్రాల్లో మహిళలకు కుట్టు శిక్షణ నేర్పించేందుకు ఒక ట్రైనర్‌, వారి హాజరును ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు ఒక డిజిటల్‌ అసిస్టెంట్‌ను ఏర్పాటు చేశారు. వీరికి ఒక్కొక్కరికి నెలకు రూ.10 వేలు వేతనాలను అందించాలని నిర్ణయించారు. ఆయా కేంద్రాల్లో మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చిన వీరిలో పలువురికి నేటికీ పూర్తి స్థాయిలో వేతనాలను అందించనట్లు తెలుస్తోంది. ఈ పథకం నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్ల వీరికి వేతనాలను అందించలేక పోతున్నట్లు సమాచారం.

శిక్షణ పొందిన మహిళల ఆందోళన

పలు ప్రాంతాల్లో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు తమకు కుట్టు మిషన్లు ఎప్పుడు ఇస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుట్టు శిక్షణ తీసుకుంటే తమకు ఉపాధి లభిస్తుందనే ఆశతో ప్రతి రోజు క్రమం తప్పకుండా కేంద్రానికి వెళ్లి శిక్షణ తీసుకున్నామంటున్నారు. ఎలాంటి ఇతర పనులకు వెళ్లకుండా శిక్షణ పూర్తి చేసుకున్న తమకు సర్టిఫికేట్‌, కుట్టు మిషన్లు అందించాలని కోరుతున్నారు.

జిల్లా కేంద్రాల శిక్షణ పొందిన

కర్నూలు 24 3108

నంద్యాల 23 3024

మొత్తం: 47 6132

శిక్షణ పూర్తయినా అందని మిషన్లు

తాజాగా పరీక్ష, రూ.600 చెల్లించాలని మెలిక

పరీక్ష పాస్‌ అయితేనే మిషన్లు ఇస్తారంట!

తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు

ఉమ్మడి జిల్లాలో శిక్షణ పూర్తి చేసుకున్న

6వేల మంది మహిళలు

తమకెలాంటి సమాచారం లేదంటున్న

బీసీ కార్పొరేషన్‌ అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement