వైద్యం అందక.. ‘ఓపి’క లేక! | - | Sakshi
Sakshi News home page

వైద్యం అందక.. ‘ఓపి’క లేక!

Mar 20 2026 8:03 AM | Updated on Mar 20 2026 8:03 AM

కర్నూలు పెద్దాసుపత్రిలో రోగుల సహనానికి పరీక్ష

డాక్టర్‌ పరీక్షించడానికి ఒకరోజు వైద్య పరీక్షలకు మరోరోజు

చికిత్సకు ఇంకో రోజు ముందే అస్వస్థత.. ఆపైన అవస్థ!

కోడుమూరు మండలానికి చెందిన సుంకులమ్మ కడుపునొప్పితో బాధపడుతూ గత బుధవారం సర్జరీ విభాగానికి వెళ్లారు. వైద్యులు పరీక్షించి ఆమెకు అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ రాశారు. స్కానింగ్‌ వద్ద సిబ్బంది ఈ రోజుకు టోకన్లు అయిపోయాయి...23వ తేదీ రావాలని చెప్పి పంపించారు. అప్పటి దాకా డాక్టర్‌ రాసిచ్చిన మందులు వాడాలని సూచించారు.

గూడూరుకు చెందిన రామాంజనేయులు జ్వరంతో బాధపడుతూ రెండు రోజుల క్రితం ఆసుపత్రికి వచ్చాడు. జనరల్‌ మెడిసిన్‌ వైద్యులు అతన్ని పరీక్షించి రక్తపరీక్షలు రాశారు. రక్తపరీక్షలు చేయించుకుని వచ్చేసరికి మధ్యాహ్నం 3.30 గంటలు దాటింది. అప్పటికే వైద్యులు ఓపీలో లేకుండా వెళ్లారు. ఆ తర్వాత ఈ రిపోర్ట్‌ ఎవ్వరికి చూపించాలో తెలియక ఆయన వెనుదిరిగి వెళ్లిపోయాడు.

మంత్రాలయానికి చెందిన తిక్కన్న కొంత కాలంగా నడుం నొప్పితో బాధపడుతున్నాడు. కొంత కాలం పాటు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు. అక్కడ తగ్గకపోవడంతో మెరుగైన వైద్యం కోసం గత బుధవారం అతను పెద్దాసుపత్రికి వస్తే పరీక్షించిన వైద్యులు ఎంఆర్‌ఐ పరీక్ష రాశారు. పరీక్ష కేంద్రం వద్ద అతనికి 23వ తేదీ రావాలని సూచించారు. అప్పటి వరకు డాక్టర్‌ రాసిచ్చిన మందులు వాడాలని సూచించారు.

.. ఇలాంటి అనుభవం ఆసుపత్రిలో నిత్యం వందలాది మందికి ఎదురవుతోంది. అస్తవ్యస్తంగా ఉన్న వైద్య విధానం చాలా మంది రోగులను ఇబ్బందులకు గురిచేస్తోంది. పెద్దాసుపత్రిని నమ్ముకుని సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఇక్కడ తీవ్ర నిరాశే మిగులుతోంది. ఓపీ టికెట్‌ తీసుకునేటప్పటి నుంచి చివరకు మందులు తీసుకుని ఇంటికి వెళ్లే వరకు గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విధానం వల్ల చాలా మంది రోగులు మధ్యలోనే వెనుదిరిగి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు. ఇలాంటి అనుభవాలు ఎదురైన అధిక శాతం చిన్నచిన్న వ్యాధులకు స్థానిక ఆర్‌ఎంపీలచే వైద్యం చేయించుకుని ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు.

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు ప్రతిరోజూ 2,500 నుంచి 3,500 మంది దాకా ఓపీ చికిత్సకు రోగులు వస్తున్నారు. వీరిలో అధిక శాతం గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుపత్రులు తిరిగి తగ్గక మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు వస్తున్న వారే ఉన్నారు. ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే వారికి ఓపీ టికెట్లు ఇచ్చేందుకు గతంలో రెండు, మూడు కౌంటర్లు మాత్రమే ఉండేవి. గత ప్రభుత్వ హయాంలో వాటిని భారీగా పెంచారు. డిజిటల్‌ ఓపీ విధానాన్ని ప్రవేశపెట్టి రోగులకు త్వరగా ఓపీ టికెట్‌ అందేలా చూశారు. ఈ విధానంతో ప్రస్తుతం ఓపీ టికెట్‌ కోసం ఎక్కువ సమయం వేచి ఉండే అవసరం లేకుండా పోయింది. అయితే ఓపీ విభాగాల వద్ద వైద్యులకు చూపించుకోవడానికి సోమ, మంగళ, బుధవారాల్లో అధికంగా క్యూ ఉంటోంది. అక్కడ చికిత్స చేయించుకున్న వైద్యులు రాసిన వైద్యపరీక్షల చీటీలు తీసుకుని డయాగ్నోస్టిక్‌ బ్లాక్‌కు వస్తే అక్కడ అప్పటికే వందల మంది క్యూలో ఉంటున్నారు. ఎక్స్‌రే, వివిధ రకాల రక్తపరీక్షలు, మూత్రపరీక్షల కోసం ఒక్కొక్కరు కనీసం గంటసేపు వేచి ఉండాల్సి వస్తోంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత వచ్చిన వారికి అల్ట్రాసౌండ్‌ పరీక్షలను అదే రోజు చేయకుండా రెండు రోజుల తర్వాత రావాలని చెబుతున్నారు. అప్పటికే నిర్వహించిన రక్తపరీక్షల నివేదికలు మధ్యాహ్నం 3 నుంచి 3.30 గంటల మధ్యలో ఇస్తున్నారు. వీటి కోసం ఒకప్పుడు సినిమా టికెట్ల కోసం ఒకరిపై ఒకరు పడ్డ విధంగా తీసుకోవాల్సి వస్తోంది. తీరా నివేదికలు తీసుకుని ఓపీ విభాగాల వద్దకు వెళితే అప్పటికే వైద్యులు వెళ్లిపోయి ఉంటున్నారు. క్యాజువాలిటికీ వెళితే మళ్లీ ఓపీకే వచ్చేవారం రావాలంటూ సెలవిచ్చి పంపిస్తున్నారు. ఎక్స్‌రే ఫిల్మ్‌ల నివేదికలు మరుసటి రోజు ఇస్తున్నారు. ఇవి తీసుకోవడానికి ఒకరోజు, వాటిని తీసుకుని వైద్యుల వద్ద చికిత్సకు మరోరోజు రావాల్సి వస్తోంది.

సాయంత్రం 4 గంటల వరకు ఓపీ ఎక్కడ!

ఆసుపత్రిలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రోగులకు ఓపీ చికిత్స అందించాలని స్వయానా డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ) పలుమార్లు ఆసుపత్రికి వచ్చినప్పుడు ఆదేశించారు. అయినా ఓపీలో వైద్యులు ఉండటం లేదు. అధిక శాతం ఉదయం 12 గంటల వరకు మాత్రమే ఉంటున్నారు. ఆ తర్వాత ఒకరిద్దరు పీజీలు చికిత్స అందిస్తున్నారు. మధ్యాహ్నం భోజనం తర్వాత 2 గంటలకు సైతం పీజీలే ఉంటున్నారు. 3.30 గంటల తర్వాత చాలా మంది ఓపీలో ఉండటం లేదు. ఈ సమయంలో వైద్యపరీక్షల నివేదికలు తీసుకుని వచ్చిన రోగులకు వైద్యులు కనిపించక వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. ఆయా ఓపీల్లో వైద్యులు, వైద్యపరీక్ష కేంద్రాల్లో సిబ్బంది ఉన్నారా లేరా అని పర్యవేక్షించాల్సిన అధికారులు కార్యాలయాలకే పరిమితం అవుతున్నారు.

ఎంఆర్‌ఐ కోసం రోజుల తరబడి!

ఆసుపత్రిలో ఎంఆర్‌ఐను గత 8 ఏళ్లుగా ఓ ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ 25 నుంచి 30 వరకు మాత్రమే ఎంఆర్‌ఐలు తీయగలుగుతున్నారు. ఓపీ విభాగంలో వైద్యులు రాసిన చీటీ తీసుకుని ఇక్కడకు వచ్చిన రోగులకు మూడు, నాలుగు రోజుల తర్వాత రావాలని సమయం ఇస్తున్నారు. వారు చెప్పిన రోజులో ఎంఆర్‌ఐ తీయించుకున్నాక నివేదిక కోసం మరో రెండు రోజులు ఆగి రావాల్సి వస్తోంది. ఇలా ఎంఆర్‌ఐ పరీక్ష కోసమే వారం రోజులు పడుతోంది. ఆ నివేదిక తీసుకుని వైద్యుల వద్దకు వెళితే మొదట్లో చూసిన డాక్టర్లు ఉండటం లేదు. నిన్ను చూసిన డాక్టర్‌ లేరు...ఫలానా రోజు రావాలంటూ వెనక్కి పంపిస్తున్నారు. ఇలాంటి విధానం వల్ల రోగులు నిత్యం వేదనకు గురవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement