శ్రీశైలంటెంపుల్: జ్యోతిర్లింగక్షేత్రమైన శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు గురువారం మల్లన్న రథోత్సవం కనుల పండువగా సాగింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామిఅమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో ఊరేగింపుగా రథశాల వద్దకు తోడ్కొనివచ్చి రథంపై అధిష్టింపజేశారు. అనంతరం స్థానాచార్యులు రథాంగపూజ, రథాంగహోమం, రథాంగబలి నిర్వహించారు. అర్చకులు ఉత్సవమూర్తులకు ప్రత్యేక హారతులిచ్చారు. రథానికి దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు, అధికారులు కూష్మాండబలి సమర్పించారు. ప్రత్యేక హారతి ఇచ్చి రథోత్సవాన్ని ప్రారంభించారు. లక్షలాది మంది భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. కన్నడ భక్తులు ‘సిరిగిరి మల్లయ్య.. మహాత్మ మల్లయ్య’ అని కొనియాడుతూ ఓంకారనాద ధ్వనుల మధ్య భక్తిపూర్వకంగా రథంపైకి అరటిపండ్లు, ఖర్జూరాలు, కలకండ విసిరి భక్తి చాటుకున్నారు. రథోత్సవం గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు నిర్వహించారు. ఉత్సవంలో కర్ణాటక జాంజ్, వీరగాసీ, కన్నడ జానపద డోలు, కోలాటం, చెక్కభజన, పగటి వేషాల ప్రదర్శన, గొరవయ్యల, నందికోలు నృత్యాలు అలరించాయి. రథోత్సవ దర్శనంతో సర్వపాపాలు తొలగిపోతాయని, కోరిన కొర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.
రాజరాజేశ్వరీ అలంకారం
ఉగాది మహోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు శ్రీభ్రమరాంబాదేవి రమావాణీసేవిత రాజరాజేశ్వరీ అలంకారంలో భక్తులకు కటాక్షించారు. చతుర్భుజాలు కలిగిన ఈ దేవి పాశం, అంకుశం, పద్మం, చెరకుగడను ధరించి దర్శనం ఇచ్చారు. ఈ దేవిని దర్శిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని, సమస్యలన్నీ తొలగిపోతాయని పురాణాల్లో చెప్పారు.
నేడు ఉగాది ఉత్సవాలకు పూర్ణాహుతి
ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభమైన ఉగాది మహోత్సవాలకు శుక్రవారం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అమ్మవారు భ్రమరాంబాదేవి నిజాలంకరణ అలంకారం, స్వామిఅమ్మవార్లకు అశ్వవాహనసేవ ఆలయ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. దీంతో ఉగాది మహోత్సవాలు ముగుస్తాయి.
శ్రీశైలంలో రమణీయంగా రథోత్సవం
స్వామిఅమ్మవార్ల దర్శనంతో
పులకించిన భక్తులు
రమావాణీ సేవిత
రాజరాజేశ్వరి అలంకారంలో
భ్రమరాంబాదేవి కటాక్షం
ఉగాది మహోత్సవాలకు
నేడు పూర్ణాహుతి


