ఉయ్యాలవాడ: మండలంలోని సుద్దమల్ల గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ కంబగిరి స్వామి ఆలయం గురువారం భక్తులతో కిటకిటలాడింది. ఉగాది పండుగ సందర్భంగా ఏటా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఉదయం స్వామి కి అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు. మంగళవాయి ద్యాలు, వేద మంత్రాల నడుమ శ్రీ లక్ష్మీనరసింహ కంబగిరి, లక్ష్మీదేవి అమ్మవార్ల కల్యాణాన్ని కనుల పండువగా జరిపించారు. సాయంత్రం అల్లూ రు, సుద్దమల్ల గ్రామస్తులు తేరుబండ్లతో ఆలయానికి చేరు కుని వృషభరాజములచే ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. మండల ప్రజలతో పాటు ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల, జమ్మలమడుగు మండలాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. ఉగాది పండుగను పురస్కరించుకుని మండలంలో ఆయా గ్రామాల్లో వేద పండితులు పంచాంగ శ్రవణం చేశారు. రైతులు పండితులు సూచించిన దిశకు వెళ్లి పొలాల్లో సేద్యపు పనులు ప్రారంభించారు. అలాగే ఉయ్యాలవాడలో కళియుగ దానకర్ణుడు బుడ్డా వెంగళరెడ్డి జ్ఞాపకార్థకంగా వైఎస్సార్‌పీ నాయకులు పేదలకు అన్న వితరణ కార్యక్రమం చేపట్టారు.


