హొళగుందలో అకాల వర్షం | - | Sakshi
Sakshi News home page

హొళగుందలో అకాల వర్షం

Mar 18 2026 7:47 AM | Updated on Mar 18 2026 7:47 AM

హొళగుంద/ఆలూరు రూరల్‌: మండల కేంద్రంతో పాటు గజ్జహళ్లి, వందవాగిలి తదితర గ్రామాల్లో మంగళవారం అకాల వర్షం కురిసింది. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశంలో వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులు భయపెట్టాయి. వర్షంతో పాటు కొద్దిపాటి ఈదురుగాలులు వీయడంతో మామిడి పిందెలు నేలరాలాయి. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, ఎండు మిరప తడిసి పోయాయి. ఈ సమయంలో ఆదోని నుంచి హొళగుంద సబ్‌స్టేషన్‌కు కొద్ది సేపు అధికారులు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. పగలంతా వడగాల్పులు, తీవ్ర ఉష్ణోగ్రతతో అల్లాడిన ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగింది. ఈ ఏడాది తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) కింద రబీకి నీరివ్వకపోవడంతో వరిసాగు చేయక పోవడంతో పంట నష్టం చోటు చేసుకోలేదు. ఆలూరు మండలం కమ్మరచేడు గ్రామంలో మంగళవారం సాయంత్రం వడగండ్ల వర్షం కురిసింది. ఈదురు గాలులతో వడగండ్లు పడటంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. నెల రోజులుగా ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు సాయంత్రం కురిసిన వానతో వాతావరణం చల్లబడి ఊరట చెందారు.

రాజమండ్రి ఆర్డీఓగా ఆర్‌.శివరాముడు

కర్నూలు(సెంట్రల్‌): రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జరిపిన పలువురు డీఆర్వోలు, ఆర్‌డీఓల బదిలీల్లో భాగంగా కలెక్టరేట్‌ ఏఓగా పనిచేస్తున్న ఆర్‌.శివరాముడు రాజమండ్రి ఆర్‌డీఓగా బదిలీ అయ్యారు. ఆయన వాస్తవానికి ఫిబ్రవరి 24న కడపలోని తెలుగు గంగ ప్రాజెక్టు యూనిట్‌–2 ఎస్‌డీసీగా బదిలీ అయ్యారు. అయితే ఆయన ఆ పోస్టులో ఇంత వరకు చేరలేదు. ఈనేపథ్యంలో మంగళవారం జరిపిన బదిలీల్లో కడప నుంచి రాజమండ్రి ఆర్‌డీఓగా బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement