గ్రామోత్సవం నిర్వహిస్తున్న దృశ్యం
శ్రీశైలంటెంపుల్: ఉగాది మహోత్సవాల్లో రెండో రోజు మంగళవారం శ్రీగిరిలో భ్రమరాంబాదేవి మహాదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారు ఎనిమిది భుజాలతో శోభిల్లుతూ భక్తులను కటాక్షించారు. శంఖం, చక్రం, గద, పద్మం, త్రిశూలం, ఖడ్గం ధరించి అభయమిచ్చారు. ఉభయ దేవాలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో కై లాసవాహనాన్ని అదిష్టించిన స్వామిఅమ్మవార్లకు అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాదుర్గ అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారికి ప్రత్యేక హారతులిచ్చారు. మహాదుర్గగా అలంకీకృతులైన భ్రమరాంబాదేవిని, కై లాసవాహనాధీశులైన స్వామిఅమ్మవార్లను ఆలయ ఉత్సవం నిర్వహించి రాజగోపురం మీదుగా క్షేత్రప్రధాన వీధుల్లోకి తీసుకువచ్చారు. క్షేత్రపురవీధుల్లో కన్నడ భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకుని నీరాజనాలు సమర్పించారు. గ్రామోత్సవం గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు అక్కడి నుంచి బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు కొనసాగింది. ఈ గ్రామోత్సవంలో కోలాటం, చెక్కభజన, కళాకారుల వేశాల ప్రదర్శన, బుట్టబొమ్మలు, గొరవయ్యల నృత్యం, తప్పెట్లు, కొమ్మువాయిద్యాలు, జానపద డోలు, నందికోలు నృత్యాలు గ్రామోత్సవానికి మరింత వన్నె తీసుకువచ్చాయి. పూజా కార్యక్రమాల్లో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, ఏఈవోలు, అధికారులు, సిబ్బంది, అర్చకులు, వేదపండితులు, అధికారులు పాల్గొన్నారు.
నేడు వీరాచార విన్యాసాలు..
ఉగాది మహోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రభోత్సవం నిర్వహిస్తారు. అలాగే స్వామిఅమ్మవార్లకు నందివాహనసేవ, శ్రీభ్రమరాంబాదేవికి మహాసరస్వతి అలంకార సేవ నిర్వహిస్తారు. రాత్రి 10 గంటలకు వీరశైవుల వీరాచార విన్యాసాలు, అగ్నిగుండప్రవేశం నిర్వహిస్తారు. శివదీక్షా శిబిరాల వద్ద నిర్వహించే వీరచార విన్యాసాల కార్యక్రమానికి దేవస్థానం విస్త్రత ఏర్పాట్లు చేయగా, పోలీసు శాఖ పటిష్ట బందోబస్త్ చేపట్టింది.
కనుల పండువగా కొనసాగుతున్న
ఉగాది మహోత్సవాలు
మహాదుర్గగా శ్రీశైల భ్రామరి దర్శనం
కై లాస వాహనంపై
ఆది దంపతుల విహారం
కన్నడ భక్తులతో పోటెత్తిన శ్రీశైలం
నేడు ప్రభోత్సవం, నందివాహనసేవ,
వీరాచార విన్యాసాలు
శ్రీగిరికి పోటెత్తుతున్న కన్నడ భక్తులు
శ్రీశైల మహాక్షేత్రంలో నిర్వహిస్తున్న ఉగాది మహోత్సవాలను తిలకించి ఆధ్యాత్మిక అనుభూతి పొందుతూ కన్నడ భక్తులు పరవశించిపోతున్నారు. ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి లక్షలాది మంది భక్తులు శ్రీగిరికి చేరుకుంటున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా వేలాది మంది కన్నడ భక్తులు చంటి ప్లిలతో, మహిళలు, వృద్ధులు సైతం నల్లమల అడవుల్లో పాదయాత్రగా తరలివస్తున్నారు. తప్పెట దరువులతో, రంగులు చల్లుకుంటూ, చిందులు వేస్తూ ‘మల్లన్న.. నీ దర్శనానికి వచ్చాం..’ అంటూ కన్నడ భక్తులు ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు. క్షేత్రానికి చేరుకు న్న కన్నడ భక్తులు స్వామిఅమ్మవార్ల దర్శనానికి బారులుదీరారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ఆలయ పూజా వేళలను మార్పులు చేసి వేకువజాము నుంచే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. పురవీధులు భక్తులతో కిక్కిరిసిపోయాయి.


