వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

వ్యక్తి ఆత్మహత్య

Mar 18 2026 7:47 AM | Updated on Mar 18 2026 7:47 AM

పాములపాడు: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. పాములపాడుకు చెందిన బోయ అమర్‌ తాగుడుకు బానిసై కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసేవాడు. దీనిపై భార్య శ్యామల మందలించడంతో ఈ నెల 14న ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్థాపం చెంది రాత్రి ఇంట్లో గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే కర్నూలు ప్రభుత్వ వైధ్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య శ్యామల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్‌ షేక్షావలి తెలిపారు. మృత దేహానికి కర్నూలులోనే పంచనామా నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు.

మిషన్‌లో పడి..

ఆదోని అర్బన్‌: ప్రమాదవశాత్తూ వేరుశనగకాయల కోత మిషన్‌లో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మండల పరిధిలోని దొడ్డనగేరి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన పార్వతి కుమారుడు బోయ వీరేంద్ర (32) వ్యవసాయం చేస్తూ కూలీ పనికి పోయేవాడు. మంగళవారం మిషన్‌కు వేరుశనగకాయల కట్టె వేసే పనికెళ్లాడు. చేతికి టవాల్‌ కట్టుకుని వేరుశనగకాయల కట్టెను మిషన్‌లో వేస్తుండగా టవాల్‌ను లాక్కొని ఆ వ్యక్తిని కూడా మిషన్‌ లోపలికి లాక్కొంది. దీంతో కొట్టుమిట్టాడుతూ వీరేంద్ర అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య పల్లవి, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం భార్య గర్భిణి. వీరేంద్ర మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆటో – బైక్‌ ఢీ

ఒకరు దుర్మరణం..

మరో ముగ్గురికి గాయాలు

ఎమ్మిగనూరురూరల్‌: మండల పరిధిలో ప్రవహించే లోలెవల్‌ కాలువ (ఎల్లెల్సీ) సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఆటో – మోటార్‌ బైక్‌ ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఎమ్మిగనూరు పట్టణంలోని మిలటరీ కాలనీకి చెందిన నారాయణ, భార్య లీలమ్మ, కుమార్తె జాహ్నవి, మరో వ్యక్తి కలసి ఆటోలో ఆదోని నుంచి ఎమ్మిగనూరుకు వస్తున్నారు. ఎమ్మిగనూరు నుంచి పెద్దకడుబూరు మండలం గంగులపాడు గ్రామానికి చెందిన గోవిందప్ప అనే వ్యక్తి మోటార్‌ బైక్‌పై గ్రామానికి వెళ్తున్నాడు. ఎల్‌ఎల్‌సీ కాలువ సమీపంలో బైక్‌ ఆటోను ఢీ కొట్టడంతో ముందు సీట్లో కూర్చున్న నారాయణ(59) అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, లీలమ్మ, జాహ్నవి, మరొకరికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా నారాయణ మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.

క్వింటా వేరుశనగ రూ.8,670

ఎమ్మిగనూరు టౌన్‌: స్థానిక వ్యవసాయ మార్కెట్‌కు మంగళవారం 2,423 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడులు విక్రయానికి వచ్చాయి. క్వింటా ధర గరిష్టంగా రూ.8,670 పలికినట్లు మార్కెట్‌ యార్డ్‌ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. కనిష్ట ధర రూ.4,560, మధ్యస్త ధర రూ.7,500 నమోదైందన్నారు. అదేవిధంగా ఆముదాలు 54 క్వింటాళ్లు విక్రయానికి రాగా కనిష్ట ధర క్వింటా రూ.5,737, మధ్యస్త ధర రూ.5,903, గరిష్ట ధర రూ.5,911 నమోదైంది. కందులు 4 క్వింటాళ్లు విక్రయానికి రాగా గరిష్ట ధర రూ.6,112 లభించింది.

రైలు కింద పడిగుర్తు తెలియని వ్యక్తి మృతి

కర్నూలు: కర్నూలు రైల్వేస్టేషన్‌ శివారు ఈద్గా సమీపంలో రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతని వయస్సు సుమారు 30 సంవత్సరాలు ఉంటుంది. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో రైల్వేట్రాక్‌పై మృతదేహం పడి ఉన్నట్లు స్థానికుల సమాచారంతో రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పరిశీలించారు. ప్రమాదంలో ముఖం శిథిలమై ఉండటం, ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి కింద కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించారు. నలుపు, తెలుపు రంగు హాఫ్‌ షర్టు, సిల్వర్‌ కలర్‌ వీ నెక్‌ టీషర్టు, కుడిచేతిపై ఢమరుకం, త్రిశూలం పచ్చబొట్టు, ఎడమ చేతిపై రతి అనే అక్షరాలు ఉన్నాయి. ఆచూకీ తెలిసినవారు 9247575608 (సీఐ), 9247575610 (ఎస్‌ఐ)కు సమాచారం అందించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement