● నలుగురికి గాయాలు
● గొర్రెల మందను తప్పించబోగా ఘటన
పాణ్యం: ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. తమ్మరాజుపల్లె–సిమెంట్‌నగర్ గ్రామాల మధ్య ఘాట్ దిగే చోట జరిగిన ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ఏపీ 39ఏజీ 5899 నంబర్ గల నందాల్య డిపో ఆర్టీసీ బస్సు బేతంచెర్ల నుంచి 55 మంది ప్రయాణికులతో నంద్యాలకు వస్తుంది. తమ్మరాజుపల్లె–సిమెంట్‌నగర్ గ్రామాల మధ్య ఘాట్ చివరి మలుపు వద్ద దిగే క్రమంలో ఒక్క సారిగా గొర్రెల మంద ఎదురొచ్చింది. ఆ గొర్రెలను తప్పించేందుకు డ్రైవర్ బ్రేక్ వేయగా బ్రేక్ ఫెయిల్ కావడంతో పక్కనే ఉన్న పొలాల్లోకి బస్సు దూసుకెళ్లింది. ఈ ఘాటనలో బేతంచెర్లకు చెందిన రాణి, ఉసేన్‌బీ, కమల, నాగలక్ష్మీ అనే ప్రయాణికులకు గాయాలు కావడంతో 108వాహనంలో శాంతిరామ్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న హైవే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తలించారు. నంద్యాల డిపో మెనేజర్ మాధవిలత ఈ ఘటనపై ఆరా తీశారు.


