బిల్వ స్వర్గం, వాల్మీకి గుహలపై ప్రచారం కల్పించండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: జిల్లాలోని బిల్వ స్వర్గం గుహలు, వాల్మీకి గుహలపై ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో పర్యాటక సమాచార స్టిక్కర్లను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. పర్యాటకులకు అవసరమైన సమాచారాన్ని సులభంగా అందుబాటులో ఉంచడం ద్వారా జిల్లాకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నారు. పర్యాటక సమాచారాన్ని ప్రజలకు చేరవేసే దిశగా జిల్లాలోని అన్ని గ్రామ సచివాలయాలలో పర్యాటక సమాచార స్టిక్కర్లు ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యార్థుల క్షేత్ర పర్యటనల్లో బిల్వ స్వర్గం గుహలు, వాల్మీకి గుహలను చేర్చాలని, ఉపాధ్యాయుల ద్వారా ఫీల్డ్ విజిట్లు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డీఈఓ జనార్దన్‌రెడ్డిని ఆదేశించారు. ఆధ్యాత్మిక పర్యాటకం, ఈకో టూరిజం, సహజ గుహలు వంటి విభిన్న ఆకర్షణలు కలగలిసిన నంద్యాల జిల్లా పర్యాటకులకు అనుకూలమైన జిల్లాగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ పర్యాటక అభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ లక్ష్మీనారాయణ, టూరిజం అధికారి ఉమాదేవి, సెట్కూరు సీఈఓ వేణుగోపాల్, బెలుం గుహల యూనిట్ మేనేజర్ కిశోర్, బిల్వ స్వర్గం యూనిట్ మేనేజర్ మధుమోహన్‌రెడ్డి, వాల్మీకి గుహల యూనిట్ మేనేజర్ గిరి పాల్గొన్నారు.


