శరవేగంగా వసంత పంచమి ఏర్పాట్లు
కొత్తపల్లి: కొలనభారతి క్షేత్రంలో ఈనెల 23వ తేదీన నిర్వహిస్తున్న వసంత పంచమికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీశైలం దేవస్థానం అధికారులు తెలిపారు. ఆదివారం శ్రీశైల దేవస్థాన అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు విజయ్‌కుమార్‌స్వామి, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ నరసింహారెడ్డి, వసంత పంచమి మహోత్సవ ప్రత్యేక అధికారి ఎం.ఫణిధర ప్రసాద్, డీఈఈ నరసింహారెడ్డి, అధికారులు, వైదిక సిబ్బంది కొలను భారతికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు. వసంత పంచమి రోజున సరస్వతీ అమ్మవారికి జరిపించాల్సిన ఆయా పూజాదికాలు, నివేదనలు, సామూహిక అక్షరాభ్యాసార నిర్వహణ ఏర్పాట్లు, ఉత్సవం రోజు పుష్పాలంకరణ, మంచినీటి సదుపాయం, అన్నప్రసాద వితరణ, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, సూచికబోర్డుల ఏర్పాట్లు, శౌచాలయాల ఏర్పాట్లు మొదలైన ఏర్పాట్లపై సూచనలు చేశారు. అనంతరం ఈఈ ఈఈ నరసింహారెడ్డి మాట్లాడుతూ.. వసంత పంచమి సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే ఆత్మకూరు, నందికొట్కూరు నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు.


