నిర్మాణాలకు ‘చంద్ర’ గ్రహణం
చంద్రబాబునాయుడు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పటి వరకు వేగంగా సాగుతున్న నిర్మాణ పనులు అర్ధరంతరంగా ఆగిపోయాయి. గత ప్రభుత్వంలో కొనసాగిన నిర్మాణాలు వెంటనే ఆపేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో ఐపీ భవనంతో పాటు మెడికల్ కాలేజిలో ఎగ్జామినేషన్ హాలు, లెక్చరర్ గ్యాలరీ నిర్మాణాలు ఆగిపోయాయి. ఐపీడీకి రూ.21కోట్లు, లెక్చరర్ గ్యాలరీకి 2.95కోట్లు, ఎగ్జామినేషన్ హాలుకు రూ.79లక్షలు బిల్లులు బకాయిలు మిగిలాయి. వీటితో పాటు పనులు పూర్తయిన కాలినరోగుల వార్డుకు రూ.50లక్షలు, స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు రూ.5కోట్లు, ఆపరేషన్ థియేటర్ మరమ్మతులు రూ.35లక్షలు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఏడాదిగా అడుగుతున్నా ఇప్పటి వరకు ఈ నిధులు విడుదల చేయలేదు. ఒక్క పనీ తిరిగి ప్రారంభం కాలేదు. ఈ విషయమై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఆసుపత్రి అధికారులు ప్రతి సమావేశంలో చెబుతున్నా ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. ఏడాదిన్నర దాటినా ఇందుకు సంబంధించి ఒక్క పనీ పునఃప్రారంభం కాలేదు. గత హెచ్‌డీఎస్ సమావేశంలో ప్రస్తావన వచ్చినా పక్కకు పెట్టేశారు.


