‘సర్వజన’ కష్టాలు!
కర్నూలు(హాస్పిటల్): రోజూ వేలాది మంది పేదలకు వైద్యసేవలు అందించే కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు పెద్ద కష్టం వచ్చింది. రోగులు వరండాలో వైద్యం పొందాల్సిన దుస్థితి తలెత్తింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఐపీ భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగాయి. చంద్రబాబు సర్కార్‌లో 19 నెలలుగా ఒక్క ఇటుకా కదలడం లేదు. నిర్మాణానికి అవసరమైన నిధులు ఇవ్వలేదు. అలాగే కాంట్రాక్టర్‌కు డబ్బులు ఇవ్వకుండా పరోక్షంగా బెదిరించి వెనక్కి పంపారు. భవన నిర్మాణం ఆగిపోవడంతో అవసరమైన వసతులు, సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై ప్రజాప్రతినిదులు ఏడాదిన్నరగా ఇదిగో ప్రారంభిస్తామని చెబుతూ కాలం నెట్టుకొస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో ఇలా..
వైద్యరంగానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసింది. నాడు–నేడు కార్యక్రమం కింద రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, సర్వజన వైద్యశాలలు, మెడికల్ కాలేజీలు అత్యున్నత స్థానంలో ఉంచేందుకు కృషి చేసింది. ఈ మేరకు కర్నూలు మెడికల్ కాలేజీ, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలల అభివృద్ధికి రూ.500కోట్ల నిధులకు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చింది. ఇందులో రూ.350కోట్లు భవనాలకు, రూ.150కోట్లు పరికరాలకు కేటాయించింది. వీటిలో ఆసుపత్రిలో ఇన్ పేషంట్ డిపార్ట్‌మెంట్ భవనం(ఐపీ భవనం), అవుట్ పేషంట్ డిపార్ట్‌మెంట్, అధునాతన క్యాజువాలిటి, మాడరన్ మార్చురీ, బయోమెడికల్ వేస్ట్ షెడ్డు, కర్నూలు మెడికల్ కాలేజిలో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, లెక్చరర్ గ్యాలరీల నిర్మాణాలు చేపట్టేలా ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా ప్రాధాన్యత క్రమంలో ఆసుపత్రిలో ఐపీ భవనం, మెడికల్ కళాశాలలో ఎగ్జామినేషన్ హాల్, లెక్చరర్ గ్యాలరీల నిర్మాణాలు ప్రారంభించారు.
దాతల కోసం ఎదురు చూపు
ఆసుపత్రిలోని ఐపీ భవనం నిర్మాణం ఆగిపోవడం, ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం, పనులు తిరిగి ప్రారంభం కాకపోవడంతో అధికారులు, వైద్యులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో భాగంగా భవనాన్ని పాక్షికంగానైనా పూర్తి చేయించేందుకు కార్పొరేట్ సంస్థలను సంప్రదించి సీఎస్‌ఆర్ కింద నిధులు కేటాయించాలని కోరేందుకు అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. అలాగే ప్రభుత్వ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో సైతం నిధుల కోసం దాతలను సంప్రదించాలని చర్చిస్తున్నారు. ప్రభుత్వం చేయాల్సిన పనిని దాతల సహాయంతో చేయించడమేమిటని మరికొందరు వైద్యులు నోరెళ్లబెడుతున్నారు. ఇది ఒక విధంగా ప్రభుత్వానికే తలవంపులు తెస్తుందని వారు భావిస్తున్నారు.
ఒకవైపు నిర్మాణం... మరోవైపు నిధులు
గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో రెండేళ్ల సమయం కోవిడ్‌తో వెళ్లిపోయింది. మిగిలిన మూడేళ్లలో పనులను వేగంగా కొనసాగించారు. ఇందులో భాగంగా ఒకవైపు ఆసుపత్రిలో ఐపీ భవన నిర్మాణ పనులు వేగంగా సాగాయి. ఖర్చయిన రూ.60.5కోట్లలో రూ.42కోట్లు చెల్లించారు. ఇంకా రూ.18.5కోట్లు మాత్రమే బకాయి ఉంది. దీంతో పాటు కళాశాలలో లెక్చరర్ గ్యాలరీకి, ఎగ్జామినేషన్ హాలుకు పనులు జరుగుతుండగానే బిల్లులు చెల్లించారు.


