నేడు డయల్ యువర్ ఎస్‌ఈ, సీఎండీ కార్యక్రమం
కర్నూలు(అగ్రికల్చర్): నగరంలోని కొత్తబస్టాండు సమీపంలో ఉన్న విద్యుత్ భవన్‌లో నేడు డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సూపరింటెండెంట్ ఇంజినీర్ ఆర్.ప్రదీప్‌కుమార్ తెలిపారు. ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమానికి వినియోగదారులు తాము ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను 73826 14308 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేస్తే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రధాన కార్యాలయమైన తిరుపతిలో డయల్ యువర్ ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. జిల్లా వినియోగదారులు నేరుగా సీఎండీ దృష్టికి తీసుకెళ్లాలంటే 89777 16661 నంబరుకు ఫోన్ చేయాలని చెప్పారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, లోవోల్టేజీ సమస్యలు, విద్యుత్ సిబ్బంది అందుబాటు తదితర వాటిపై డయల్ యువర్ కార్యక్రమం దృష్టికి తీసుకురావచ్చని పేర్కొన్నారు.
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
నందికొట్కూరు: బ్రాహ్మణకొట్కూరు గ్రామ సమీపంలోని హంద్రీనీవా పంప్‌హౌస్ వద్ద గుర్తు తెలియని శవం లభ్యమైంది. ఇన్‌చార్జ్ ఎస్‌ఐ ఓబులేసు తెలిపిన వివరాల మేరకు.. హంద్రీనీవా కాల్వ లష్కర్లు అందించిన సమాచారం మేరకు ఎస్‌ఐ, పోలీసు సిబ్బంది పంప్‌హౌస్ వద్దకు చేరుకొని మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతుడికి సుమారు 35 ఏళ్ల వయస్సు ఉంటుందని, ఆకుపచ్చ రంగు టీ షర్టు, బ్లూ కలరు జీన్స్ పాయింట్ ధరించినట్లు పేర్కొన్నారు. ఎస్‌ఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ వైద్యశాల మార్చురీకి పోలీసులు తరలించారు.
యువతి అదృశ్యం
బండిఆత్మకూరు: మండల కేంద్రానికి చెందిన ముల్ల సానియా(23) అనే యువతి రెండు రోజులుగా కనిపించడం లేదని ఆదివారం ఎస్‌ఐ జగన్‌మోహన్ తెలిపారు. శనివారం రాత్రి ఇంటిలో అందరూ నిద్రించిన తర్వాత, ఇంటిలో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిందన్నారు. దీంతో బంధువుల ఇళ్ల వద్ద ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. ఈ మేరకు యువతి తండ్రి సయ్యద్ మోదిన్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
క్రీడాకారుల మధ్య వాగ్వాదం
● రద్దయిన క్రికెట్ సెమీ ఫైనల్ మ్యాచ్
ఆదోని సెంట్రల్/అర్బన్: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆదోని మున్సిపల్ మైదానంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్‌లో క్రీడాకారుల మధ్య ఆదివారం వాగ్వాదం చోటు చేసుకుంది. ఆదోని చాంపియన్‌షిప్–2026 పేరుతో వారం రోజుల క్రితం క్రికెట్ టోర్నమెంట్ పోటీలను నిర్వాహకులు అట్టహాసంగా ప్రారంభించారు. ఎంతో రసవత్తరంగా సాగుతున్న ఈ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. సెమీఫైనల్‌లో ఫైర్ బాల్స్ 11 కల్లుబావి, ఆదోని ఏబీసీ స్టార్స్ జట్ల మధ్య బౌలర్ విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు జట్ల మధ్య సమన్వయం పరిచి టోర్నమెంట్‌ను సాఫీగా జరిపేందుకు నిర్వాహకులు ప్రయత్నించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. వివాదం మరింత తీవ్రతరం కావడంతో పోలీసులు జోక్యం చేసుకొని ఇరు జట్లకు సర్దిచెప్పి మైదానం నుంచి వారిని పంపి వేశారు. ఆదివారం జరగాల్సిన సెమీ ఫైనల్ మ్యాచ్ దీంతో రద్దు అయ్యింది.
ఏటీఎం దొంగ అరెస్ట్
తాడిపత్రి రూరల్: తాడిపత్రిలోని కడప మార్గంలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలోని కియోస్క్ ను పెద్ద బండరాయితో పగులకొట్టే ప్రయత్నం చేసిన యువకుడిని అరెస్ట్ చేసినట్లు తాడిపత్రి రూరల్ అప్‌గ్రేడ్ సీఐ శివగంగాధర్‌రెడ్డి తెలిపారు. వివరాలను ఆదివారం ఆయన వెల్లడించారు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరుకు చెందిన దుర్గానాయుడు, తన తండ్రితో కలసి పని కోసం తాడిపత్రికి వచ్చాడు. వ్యసనాలకు బానిసైన దుర్గానాయుడు జల్సాలు తీర్చుకునేందుకు ఈజీ మనీ కోసమని ఆదివారం తెల్లవారుజామున ఏటీఎంలోని యంత్రాన్ని ధ్వంసం చేసి డబ్బు అపహరించేందుకు ప్రయత్నించాడు. విషయాన్ని గుర్తించిన ముంబయిలోని సెక్యూరిటీ ఏజెన్సీ కార్యాలయ సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకోగానే దుర్గానాయుడిని అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు. విచారణ అనంతరం దుర్గానాయుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
నేడు డయల్ యువర్ ఎస్‌ఈ, సీఎండీ కార్యక్రమం


