‘బావి’ తరాలకు అ పూర్వ సంపద!
రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి. వారి నిర్మించిన కట్టడాలు, చెరువులు, బావులు మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. అయితే చాలా చోట్ల ఉపయోగం లేక కాలగర్భంలో కలిపిపోతుండటంతో ఓ యువ సైన్యం కాపాడేందుకు ముందుకు వచ్చింది. కొలిమిగుండ్లకు చెందిన కొందరు యువకులు ‘పూర్వ సంపద రక్షక సేన’గా ఏర్పడి పురాతన బావులను సంరక్షిస్తూ బావి తరాలకు చారిత్రక సంపదను అందిస్తున్నారు. ప్యాపిలి సమీపంలోని పురాతన వెంగన్న బావి దుస్థితిని తెలుసుకున్న రక్షక సేన ఆదివారం బావి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. 40 మంది సభ్యులు పారలు, గంపలు చేతబూని పనిలోకి దిగి చెత్తాచెదారాన్ని తొలగించి బావిని శుభ్రం చేశారు. తమ గ్రామంలోని బావిని శుభ్రం చేసేందుకు ఇతర ప్రాంతాల యువకులు వచ్చిన విషయం తెలుసుకుని స్థానిక యువత సైతం వారితో చేయి చేయి కలిపారు. పూర్వ సంపద రక్షక సేన సభ్యులకు స్థానికులు బావి వద్దే భోజన సౌకర్యం కల్పించారు. ఒకప్పుడు బాటసారుల దాహార్తిని తీర్చిన ఇలాంటి పురాతన బావులను కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని రక్షకసేన సభ్యులు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 13 బావులను శుభ్రం చేశామన్నారు. జిల్లాలో ఇలాంటి సమస్య ఎక్కడ ఉన్నా అక్కడకు చేరుకుని వెంటనే శుభ్రం చేస్తామన్నారు. ఈ సందర్భంగా కొలిమిగుండ్ల యువకులను స్థానికులు అభినందించారు. – ప్యాపిలి


