నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
కర్నూలు(అర్బన్): పవిత్ర తుంగభద్ర నది తీరాన సంకల్‌భాగ్ హరిహర క్షేత్రంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి 20వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సండేల్ చంద్రశేఖర్, గౌరవాధ్యక్షులు చెరువు దుర్గాప్రసాద్ తెలిపారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ధ్వజారోహణంతో ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 29వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు లక్ష్మి గణపతి, నారాయణ, రుద్ర దుర్గా, మన్యుసూక్త, సరస్వతీ, లక్ష్మికుభేర, నవగ్రహ, మృత్యుంజయ, పంచసూక్తి హోమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 28న పూర్ణాహుతి, 29న ధ్వజారోహణం, చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు. ఈ నేపథ్యంలోనే వివిధ రూపాల్లో ప్రతి రోజు వాహన సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నగరంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనాలని వారు కోరారు.
నేర ప్రవృత్తికి స్వస్తి పలకండి
కర్నూలు (టౌన్): చట్ట వ్యతిరేక కార్య కలాపాలకు దూరంగా ఉండాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని డీఐజీ, జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లలో రౌడీ షీటర్లు, నేర చరిత్ర, చెడు నడత కలిగిన వ్యక్తులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించాల, చట్ట వ్యతిరేక కార్య కలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.


