జల్సాలకు అలవాటు పడి అడ్డదారి
● బ్యాటరీలు చోరీ చేస్తూ
పట్టుబడిన ఇద్దరు దొంగలు
కర్నూలు: ఆ ఇద్దరు సమీప బంధువులు, కుల వృత్తి ద్వారా జీవనం సాగించేవారు. మద్యం, జల్సాలకు అలవాటు పడి వచ్చే ఆదాయం చాలక, సులువుగా డబ్బు సంపాదించే మార్గాన్ని అన్వేషించారు. ఇద్దరు బ్యాటరీ చోరీలను ఎంచుకున్నారు. కర్నూలు శివారు కాలనీలు సంతోష్‌నగర్, ఉద్యోగనగర్, ఎన్‌టీఆర్ బిల్డింగ్స్, వీకర్ సెక్షన్ కాలనీ, న్యూ ఈద్గా ప్రాంతాల్లో పార్కు చేసిన వాహనాల బ్యాటరీలను చోరి చేసి తక్కువ ధరకే విక్రయించి వచ్చిన సొమ్ముతో జల్సా చేసేవారు. ఆటోలు, ట్రాక్టర్లు, జేసీబీలు, బోర్‌వెల్ వాహనాలకు అమర్చిన బ్యాటరీలను రాత్రి వేళల్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేస్తున్నారని గత నెలలో ఇద్దరు వాహన యజమానులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాల్గవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులో బాగంగా ఆయా కాలనీల్లోని వాహన పార్కింగ్ స్థలాల్లో సీసీ ఫుటేజీలను సేకరించారు. కల్లూరు నిర్మల్‌నగర్ సమీపంలోని చెంచు కాలనీలో నివాసం ఉంటున్న మహేంద్ర, సుధాకర్‌లు ఈ నేరాలకు పాల్పడినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. వారి కదలికలపై నిఘా వేసి పక్కా ఆధారాలతో ఆదివారం గుత్తి పెట్రోల్ బంక్ వద్ద అదుపులోకి తీసుకొని విచారించగా, బ్యాటరీ దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు. ఈ మధ్య కాలంలో చోరీ చేసిన 11 బ్యాటరీలను విక్రయించేందుకు ఇంటి వెనుకాల షెడ్డులో దాచి ఉంచినట్లు తెలపడంతో వాటిని స్వాధీనం చేసుకొని సీఐ విక్రమసింహ ఎదుట హాజరు పరచగా, ఎస్‌ఐలు గోపినాథ్, శరత్‌కుమార్‌తో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి సీఐ వివరాలను వెల్లడించారు. చోరి చేసిన బ్యాటరీల విలువ దాదాపు రూ.1.50 లక్షలు ఉంటుందని తెలిపారు. ఒక్కొక్కటి రూ. 2,3 వేలకే విక్రయించి వచ్చిన డబ్బుతో వీరు జల్సాలు చేసేవారని తెలిపారు. వీరిద్దరితో పాటు మరొకరు కూడా ఈ నేరాల్లో పాల్గొన్నట్లు ఆధారాలు లభించాయని, ప్రస్తుతం పరారీలో ఉన్న వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. వాహనాలు ఇళ్ల ముందు పార్క్ చేసినప్పుడు అవి చోరీలకు గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆర్థిక స్థోమత ఉన్న వారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. చోరీలకు పాల్పడిన ఇద్దరిని రిమాండ్‌కు పంపుతున్నట్లు వివరించారు.


