అపూర్వ ‘వేడుక’కు సన్నద్ధం
కొలిమిగుండ్ల: దాదాపు 67 ఏళ్ల క్రితం నాటి నుంచి మండల కేంద్రం కొలిమిగుండ్ల ఉన్నత పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు అపూర్వ వేడుకకు సిద్ధమవుతున్నారు. వేలాది మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. ఈ పాఠశాల నిరుపేద, మధ్య తరగతికి చెందిన ఎంతో మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దింది. 1958లో కొలిమిగుండ్లలో ఉన్నత పాఠశాల ఏర్పాటైంది. అప్పటి నుంచి ప్రస్తుత విద్యా సంవత్సరం వరకు ఆరవ తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకున్న విద్యార్థులంతా కలిసి పూర్వవిద్యార్థుల సమ్మేళన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకోసం ఫిబ్రవరి 8వ తేదీని ఖరారు చేశారు. కొలిమిగుండ్ల వాసి మైన్స్‌అండ్ జియాలజీ మాజీ డైరెక్టర్ వీడీ రాజగోపాల్ తన సహచర బృందం ఆధ్వర్యంలో ఈ వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. కార్యక్రమ నిర్వహణపై ఎప్పటికప్పుడు చర్చించుకుంటున్నారు. పూర్వ విద్యార్థులు వివిధ ప్రాంతాల్లో ఉండటంతో వారి ఫోన్ నంబర్లను సేకరించేందుకు ప్రతి 25 మందికి ఒక కమిటీ చొప్పున నియమించారు. అలాగే విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుల వివరాలు సేకరిస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనం పెద్ద ఎత్తున నిర్వహించి ప్రతి ఒక్కరూ అలనాటి జ్ఞాపకాలను పంచుకునేందుకు ఏర్పాట్లు చకచక సాగుతున్నాయి.
ఫిబ్రవరి 8న పూర్వ విద్యార్థుల
సమ్మేళనం
1958 బ్యాచ్ నుంచి అందరినీ
ఆహ్వానించే ప్రయత్నం


