ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను రెండేళ్లు కావస్తున్నా అమలు
● నెరవేరని రూ.15.08 కోట్ల
పనుల హామీ
● నేటికీ రూ.8 కోట్ల పనులకు లభించని
పాలనా అనుమతులు
● కేంద్ర ప్రభుత్వ నిధులతో
రూ.4 కోట్ల పనులకు మోక్షం
● మంజూరు కానున్న
పుచ్చకాయలమాడ–
రామచంద్రాపురం రోడ్డు
● ఫీజుబులిటీ లేదని
రూ.1.20 కోట్ల పనులు
తిరస్కరణ
పాలనా అనుమతులు లభించని పుచ్చకాయలమాడ–హోసూరు రోడ్డు
కర్నూలు(అర్బన్): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2024 అక్టోబర్ 1న పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి పత్తికొండ నియోజకవర్గం పుచ్చకాయలమాడ గ్రామం నుంచి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో గ్రామానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. అక్కడ జరిగిన సభలోనే ప్రజలు కోరిన విధంగా రూ.15.08 కోట్ల విలువైన అభివృద్ధి పనులను చేపట్టేందుకు హామీ ఇచ్చారు. ఈ పనులన్నింటినీ గత ఏడాది సంక్రాంతి నాటికి పూర్తి చేయాలనుకున్నారు. కానీ రెండు సంక్రాంతులు పోయినా, పలు పనులకు నేటికీ పాలనా అనుమతులు కూడా లభించకపోవడం గమనార్హం. అలాగే అప్పట్లో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయిన వాటిలో ఫీజుబులిటీ లేదని మూడు పనులు తిరస్కరించగా, చంద్రబాబు హామీ ఇచ్చిన రెండు ముఖ్యమైన రోడ్ల పనులకు 16 నెలలు గడుస్తున్నా, నేటికి పాలనా అనుమతులు మంజూరు కాని పరిస్థితి. అయితే, కేంద్ర ప్రభుత్వ నిధులతో పుచ్చకాయలమాడ–రామచంద్రాపురం రోడ్డు పని మంజూరయ్యే అవకాశం కనిపిస్తోంది.
కేంద్ర నిధులే దిక్కు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామంలో అంతర్గత రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. హైస్కూల్ ప్రహరీగోడ, కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు పూర్తి చేశారు. కాగా, ఉద్యాన పంటలు పండించే గ్రామాలకు ఆయా పంట ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వ నిధులతో రహ దారి సౌకర్యాలను కల్పిస్తున్నారు. రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పలు రోడ్ల పనులు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలోనే పుచ్చకాయలమాడ నుంచి రామచంద్రాపురం వరకు రూ.4 కోట్లతో 5 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు వేసేందుకు అనుమతులు రానున్నట్లు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు.
ఫీజుబులిటీ లేదని తిరస్కరణ
నాడు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల్లో రూ.1.20 కోట్ల విలువ చేసే పనులు ఫీజుబులిటీ లేదని తిరస్కరణకు గురైనట్లు సమాచారం. గ్రామంలోని దర్గా, హిందూ శ్మశానవాటికకు ప్రహరీగోడల నిర్మాణంతో పాటు వెటర్నరీ లైవ్ స్టాక్ భవన నిర్మాణం ప్రశ్నార్థకంగా మారాయి.
రూ.8 కోట్ల పనులకు లభించని పాలనా అనుమతులు
పుచ్చకాయలమాడ గ్రామం నుంచి పెరవలి, హోసూరు గ్రామాలకు రూ.8 కోట్ల వ్యయంతో బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు అప్పట్లో హామీ ఇచ్చారు. అయితే ఈ పనులను చేపట్టేందుకు వీలుగా నేటి వరకు పీఆర్ ఈఎన్‌సీ కార్యాలయం నుంచి పాలనా అనుమతులు మంజూరు కాని పరిస్థితి. అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు స్థానిక పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు అంచనాలు రూపొందించి ప్రపోజల్స్‌ను ఈఎన్‌సీ కార్యాలయానికి పంపారు. పైగా పలుమార్లు రిమైండ్ చేసినా, నేటి వరకు అనుమతులు రాకపోవడం గమనార్హం. పనులు చేపట్టకపోవడంతో ఈ రోడ్లపై ప్రయాణం చేస్తున్న ప్రజలు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఎలాగోలా సర్దుకుపోతున్నా, వర్షాకాలంలో ఈ రోడ్లపై ప్రయాణమంటే ప్రత్యక్ష నరకమని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలు..
గ్రామంలో మూడున్నర కిలోమీటర్ల మేర రూ.1.38 కోట్లతో 16 అంతర్గత రోడ్ల నిర్మాణం
రూ.20 లక్షలతో హైస్కూల్ ప్రహరీగోడ నిర్మాణం
రూ.30 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం
పుచ్చకాయలమాడ నుంచి పెరవలి వరకు రూ.5.60 కోట్లతో 7 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు
పుచ్చకాయలమాడ నుంచి హోసూరు వరకు రూ.2.40 కోట్లతో 3 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు
పుచ్చకాయలమాడ నుంచి రామచంద్రాపురం వరకు రూ.4 కోట్లతో 5 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు
రూ.30 లక్షలతో గ్రామంలో దర్గాకు ప్రహరీగోడ
రూ.60 లక్షలతో హిందు శ్మశానవాటికకు ప్రహరీగోడ
రూ.30 లక్షలతో వెటర్నరీ లైవ్ స్టాక్ భవన నిర్మాణం


