కమనీయం.. పార్వేట మహోత్సవం
ఆళ్లగడ్డ: శ్రీ అహోబిలేశుడి పార్వేట మహోత్సవాలు కమనీయంగా సాగుతున్నాయి. కొండదిగిన ఉత్సవ పల్లకి శనివారం బాచేపల్లి గ్రామానికి చేరుకుంది. శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీ జ్వాలా నరసింహస్వాములు కొలువైన ఉత్సవ పల్లకీకి గ్రామ ప్రజలు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకీని గ్రామస్తులు భుజాలపై మోసుకుంటూ తెలుపులపై కొలువుంచుతూ భక్తిని చాటుకున్నారు.
రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులు సమర్పించుకోవచ్చన్నారు. కార్యక్రమాన్ని కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. అలాగే అర్జీదారులు meekosam.ap.gov.in అనే వెబ్‌సైట్‌లోనూ అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
చైన్నె–సూరత్ హైవేతో
అనుసంధానించండి
కర్నూలు(సెంట్రల్): చైన్నె–సూరత్ హైవేతో కర్నూలు నగరాన్ని అనుసంధానించేందుకు తక్షణమే సర్వే నిర్వహించి నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి మునిసిపల్ అధికారులను ఆదేశించారు. అలాగే ట్రాఫిక్ నియంత్రణకు బళ్లారి చౌరస్తా, రాజ్‌విహార్‌లలో ఫ్లైఓవర్ల నిర్మాణాలకు కూడా సర్వే చేయాలన్నారు. శనివారం కలెక్టర్ తన కార్యాలయంలో కర్నూలు స్మార్ట్ సిటీపై కేఎంసీ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. వెంకటరమణ కాలనీకి 24 గంటలపాటు నీటి సరఫరాకు పైప్‌లైన్‌ను సిద్ధం చేయాలన్నారు. తుంగభద్ర, హంద్రీ, కేసీ కెనాల్ కాలువల సుందరీకరణపై దృష్టి సారించాలన్నారు. నగరంలో రోడ్ల విస్తరణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ నూరుల్ ఖమర్, మునిసిపల్ కమిషనర్ విశ్వనాథ్, ఎస్‌ఈ రమణమూర్తి, ఈఈ మనోహర్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ డీఈ ఫణిరామ్ పాల్గొన్నారు.
రైలు ఢీకొని
ఎలుగుబంటి మృతి
మహానంది: నల్లమల అడవిలోని నంద్యాల–గిద్దలూరు రైలు మార్గంలో రైలు ఢీకొని ఎలుగుబంటి మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. చలమ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉదయ్ దీప్ వివరాల మేరకు.. నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లే రైల్వే మార్గంలోని గాజులపల్లె బీట్ పరిధిలో ఉన్న జీవాలమోరీ వద్ద ట్రాక్ దాటుతున్న ఎలుగుబంటిని రైలు ఢీకొంది. ఈ ఘటనలో ఎలుగుబంటి అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎఫ్‌ఆర్‌ఓ ఉదయ్‌దీప్, గాజులపల్లె పశువైద్యాధికారి శివానంద్, చలమ సెక్షన్ ఆఫీసర్ విజయవర్ధన్, ఏబీఓ మద్దిలేటిస్వామి, తదితరులు ఘటనా స్థలానికి వెళ్లి ఎలుగుబంటిని పరిశీలించారు. మగ ఎలుగుబంటిగా గుర్తించి అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం అటవీశాఖ నిబంధనల ప్రకారం దహనం చేశారు.
కమనీయం.. పార్వేట మహోత్సవం
కమనీయం.. పార్వేట మహోత్సవం


