దళితులపై దమనకాండ దారుణం
● నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపిన వైఎస్సార్‌సీపీ నాయకులు
కర్నూలు (టౌన్): రాష్ట్రంలో దళితులపై దమనకాండ సాగుతోందని మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి పర్తి చంద్రశేఖర్ అన్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ దళిత నాయకుడు మందా సాల్మన్ హత్యను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో శనివారం కర్నూలులోని కొండారెడ్డి బురుజు నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. నల్ల రిబ్బన్లు ధరించి ‘చంద్రబాబు డౌన్..డౌన్, జోహార్ అంబేడ్కర్, జైభీమ్..పోలీసుల జులుం నశించాలి.. దళితులపై దాడులు అరికట్టాలి. రెడ్ బుక్ రాజ్యాంగం నశించాలి’ అని నినాదాలు చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు.
● ఎమ్మెల్యే తాటి పర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ..కుప్పం నియోజకవర్గంలో మహిళలపై అకృత్యాలు, పిఠాపురంలో దళితులను వెలివేయడం అందరికీ తెలిసిందేనన్నారు. అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూసేందుకు ఊరికి వచ్చిన సాల్మన్‌ను టీడీపీ నాయకులు ఇనుపరాడ్లతో బాది చంపేయడం దారుణమన్నారు.
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రెండేళ్ల వ్యవధిలోనే చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. రాష్ట్రంలో గత 18 నెలలుగా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారన్నారు.
● పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు జిల్లాలో 300 దళిత కుటుంబాలను ఊర్ల నుంచి తరిమేశారన్నారు. టీడీపీ నాయకులు హత్యా రాజకీయాలు మానుకోవాలన్నారు. పార్టీ నేతలు షరీఫ్, కిషన్, ఽరాంపుల్లయ్య యాదవ్, దనుంజయ ఆచారి, కటారి సురేష్, కార్పొరేటర్లు ఆర్షియా ఫర్హీన్, మునెమ్మ, క్రిష్ణకాంత్, భారతి, లాజరస్, రాజశేఖర్, లీగల్ సెల్ నాయకులు రాజేష్, ఫిరోజ్, గద్ద రాజశేఖర్, పరుశరామ్, వన్నెష్ తదితరులు పాల్గొన్నారు.


