మిర్చి ధర రూ.25వేలు
● అతి చిన్న లాట్‌కు
పెద్ద ధర కోట్ చేసిన వ్యాపారులు
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో బాడిగ రకం మిర్చి క్వింటా రూ.25 వేల ధర పలికింది. ఈ రకం మిర్చి కేవలం 4 లాట్లు మూడు క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. అతి తక్కువ అంటే క్వింటా లోపున్న లాట్‌కు వ్యాపారులు రూ.25 వేల ధర కోట్ చేశారు. మిగిలిన లాట్లకు కేవలం రూ.8,080 మాత్రమే ధర వేయడం గమనార్హం. 2025–26లో మిర్చి సాగు పడిపోయింది. 2024–25లో మిర్చి సాగు చేసిన రైతులందరూ నష్టాలు మూటకట్టుకున్నారు. గత ఏడాది మిర్చి సాగు కలసి రాకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు వెళ్లారు. ఈ కారణంగా మిర్చి సాగు పడిపోయింది. అంతంతమాత్రం వచ్చిన మిర్చి దిగుబడులను మార్కెట్‌కు తెప్పించడం కోసం వ్యాపారులు అతి చిన్న లాట్లకు ఎక్కువ ధర కోట్ చేస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
21న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలను ఈ నెల 21న నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి ఉత్తర్వుల మేరకు ఏడు స్థాయీ సంఘ సమావేశాలను జెడ్పీలోని మినీ సమావేశ భవనంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. సమావేశాల్లో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, విద్య–వైద్యం, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, పనులు, ఆర్థిక ప్రణాళిక అంశాలపై సమీక్ష జరుగుతుందన్నారు. సమావేశాలకు ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, జడ్పీటీసీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు తమకు కేటాయించిన స్థాయీ సంఘ సమావేశాలకు హాజరు కావాలని కోరారు.
మద్దిలేటయ్యలో భక్తుల రద్దీ
బేతంచెర్ల: ఆర్‌ఎస్ రంగాపురం శివారులో వెలసిన వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శనివారం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. పుష్యమాసం పురస్కరించుకొని చిన్నారుల కేశఖండన స్వామి, అమ్మవార్ల దర్శనార్థం తరలి వచ్చిన భక్తులతో ఆలయంలో సందడి వాతావరణం నెలకొంది. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామి, అమ్మవార్లకు అభిషేకం, కుంకుమార్చన, స్వామి వారికి ప్రీతి పాత్రమైన వరపూజ నిర్వహించారు.


