రాష్ట్రంలో అరాచక పాలన
● పిన్నెల్లి ఘటన దారుణం
● ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి
ఆలూరురూరల్/చిప్పగిరి: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. చిప్పగిరిలోని తన క్యాంప్ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. పల్నాడు జిల్లా పిన్నెల్లిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త, దళితుడైన మందా సాల్మన్‌పై టీడీపీ కార్యకర్తలు ఇనుపరాడ్లతో దారుణంగా కొట్టడంతో ఆరు రోజుల పాటు మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచారన్నారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దగ్గర పడుతున్నా ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. ప్రశ్నిస్తున్నారని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను హత్య చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో దళితులకు, మహిళలకు రక్షణ లేకుండా పోతుంటే హోంమంత్రి అనిత ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సాల్మన్ భౌతికకాయాన్ని సందర్శించడానికి వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు, నాయకులను పోలీసులు అడ్డుకోవడాన్ని చూస్తే రాష్ట్రంలో అరాచకం ఏమేర రాజ్యమేలుతుందో అర్థమవుతోందన్నారు. హత్యకు గురైన వ్యక్తిపైనే కేసు పెట్టడాన్ని చూస్తే నియంత పాలన కనిపిస్తోందన్నారు. దళితుడైన సాల్మన్ హత్యకు కారకులైన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా, నియోజకవర్గ నేతలు, మండలాల నాయకులు పాల్గొన్నారు.


