అప్పుల ఉరికి వేలాడిన ఇద్దరు రైతులు
గోనెగండ్ల/ కల్లూరు: అప్పుల బాధతాళలేక కౌలు రైతు ముల్లా జైనుద్దీన్(51), రైతు డి. జయరామిరెడ్డి (45) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గోనెగండ్ల అచ్చుకట్ల వీధికి చెందిన ముల్లా జైనుద్దీన్‌కు భార్య నూరన్‌బీ, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వీరికి గ్రామంలో 1.25 ఎకరాల భూమి ఉంది. కూతుళ్ల పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులు రూ.10 లక్షలు తీర్చడానికి 2023లో జైనుద్దీన్ పొలాన్ని అమ్మివేశాడు. అయినా అప్పులు తీరలేదు. దీంతో గ్రామంలో రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని ప్రస్తుతం మొక్కజొన్న సాగుచేశాడు. పంట సాగు కోసం, కుటుంబ పోషణ కోసమని రూ.7.50లక్షల అప్పు ఉంది. అప్పులు ఇచ్చిన వారు అడుగుతుండడంతో మనోవేదనకు గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గురువారం మధ్యాహ్నం తన కొట్టంలో కొండికి ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీ సులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పుసులూరు గ్రామంలో
ఉలిందకొండ పోలీసు స్టేషన్ పరిధిలోని పుసులూరు గ్రామానికి చెందిన డి. జయరామిరెడ్డి తనకు ఉన్న నాలుగు ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత ఏడాది పత్తి పంట సాగు చేయడానికి రూ. 3.95 లక్షలు అప్పు చేశారు. పంట సరిగా రాక పూర్తిగా నష్టపోయాడు. అప్పు కట్టలేనేమోనని శుక్రవారం మధ్యాహ్నం పశువుల ఇంట్లో దూలానికి ఉరి వేసుకున్నాడు.


