శ్రీశైలంలో ముగ్గుల పోటీలు
శ్రీశైలంటెంపుల్: మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. గురువారం ఆలయ మహాద్వారానికి ఎదురుగా గంగాధర మండపం వద్ద నిర్వహించిన ఈ పోటీలలో స్థానికులే కాకుండా నంద్యాల, గుంటూరు, సూర్యాపేట తదితర ప్రాంతాలకు చెందిన మొత్తం 38మంది మహిళలు పాల్గొన్నారు. పోటీలకు దేవస్థానం ఉప కార్యనిర్వహణాధికారి ఆర్.రమణమ్మ, పర్యవేక్షకులు కె.గిరిజామణి, పి.దేవిక, డి.స్వర్ణలత న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ముగ్గుల పోటీలలో రోజారాణి మొదటి బహుమతి గెలుపొందారు. విజేతలకు దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు బహుమతులను అందజేయడంతో పాటు పోటీలలో పాల్గొన్న మహిళందరికి స్వామిఅమ్మవార్ల ప్రసాదాలు, అమ్మవారి శేషవస్త్రంగా చీర, రవిక, దేవస్థానం క్యాలెండర్ అందజేసి సత్కరించారు. దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎం.నరసింహారెడ్డి, శ్రీశైలప్రభ సంపాదకులు డా.సి.అనిల్‌కుమార్, పీఆర్వో టి.శ్రీనివాసరావు,ఽ ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 8న ఉపాధ్యాయుల సమ్మేళనం
కర్నూలు కల్చరల్: ధార్మిక, సామాజిక, సాంస్కృతిక సేవాసంస్థ వికాస భారతి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు నగర శివారులోని జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో ఉపాధ్యాయుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ సమన్వయకర్తలు ఎం.హరికృష్ణారెడ్డి, బి.సుశీలాబాయి తెలిపారు. ప్రధాన వక్తగా విశ్రాంత అసోసియేట్ ప్రొఫెసర్ అన్నదానం సుబ్రహ్మణ్యం, వక్తగా వికాస భారతి సంఘటన కార్యదర్శి బీవీ నాగేంద్ర ప్రసాద్, అతిథులుగా జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ పి.సుబ్బారెడ్డి, నంద్యాల రామకృష్ణ విద్యా సంస్థల అధినేత జి.రామకృష్ణారెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు.
కోడి పందెం ఆటగాళ్ల అరెస్టు
రుద్రవరం: మండలంలోని టీ లింగందిన్నె గ్రామ పొలిమేరలో పలు గ్రామాలకు చెందిన తొమ్మిది మంది కోడిపందెం ఆటగాళ్లను అరెస్టు చేసినట్లు రుద్రవరం ఎస్‌ఐ జయప్ప శక్రవారం తెలిపారు. వారి వద్ద నుంచి రూ.20,150 నగదును, మూడు పందెం కోళ్లను, ఏడు మోటర్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. దాడిలో సూర్యనారాయణ, రమణ ఇనే ఇద్దరు నిందితులు పారిపోయారని, వారిని అరెస్టు చేస్తామని తెలిపారు.
శ్రీశైలంలో ముగ్గుల పోటీలు


