భక్తుల చెంతకే పాండురంగడు
● వైభవం.. పార్వేట ఉత్సవం
కోవెలకుంట్ల: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సహిత పాండురంగ విఠలేశ్వరుడు భక్తుల చెంతకు చేరి పూజలందుకున్నారు. బనగానపల్లె నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం పార్వేట ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పార్వేట సందర్భంగా ఆల య అర్చకులు సుదర్శనాచార్యులు, సంజీవాచార్యు లు, పవనాచార్యుల ఆధ్వర్యంలో స్వామికి శ్రీసూక్త, భూసూక్త విధానేనా అభిషేకాలు చేశారు. అనంతరం మండల పరిధిలోని సౌదరదిన్నె, అమడాల గ్రామాల్లో స్వామివారి ఊరేగింపు అంగరంగ వైభవంగా కొనసాగింది. స్వామివారి పార్వేటను పురస్కరించుకుని సౌదరదిన్నెలో ఎస్సీ కుటుంబాల్లోని వ్యక్తులు ఉపవాసదీక్షలు ఆచరించారు. స్వామి పాండురంగస్వామి అశ్వవాహనంపై ఊరేగింపుగా గ్రామంలోకి రాగానే ఆ కుటుంబాలకు చెందిన చిన్నారులు పొర్లుదండాలతో స్వామివద్దకు వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. కాలనీకి చెందిన సంగూ, తిరుపతి వంశస్తులైన బాల నరసింహుడు ఆధ్వర్యంలో స్వామివారిని పూలమాలలతో అలంకరించి ఖడ్గాలు చదువుతూ స్వామివారికి మొదటి పూజ చేసిన అనంతరం ఉపవాసదీక్ష విరమించారు. అక్కడి నుంచి పాండురంగని ఊరేగింపు అమడాల గ్రామానికి చేరుకోవడంతో ప్రజలు ఘనస్వాగతం పలికి పూజలు నిర్వహించారు. పార్వేట సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
భక్తుల చెంతకే పాండురంగడు


