ఇంజినీర్ ప్రాణం తీసిన పని ఒత్తిడి
● అధికారుల వేధింపులే
కారణమంటున్న కుటుంబ సభ్యులు
● కోవెలకుంట్లలో విషాద ఘటన
కోవెలకుంట్ల: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ వెల్ఫేర్‌శాఖ (ప్రభుత్వ) ఇంజినీర్‌గా పనిచేస్తున్న కోవెలకుంట్లకు చెందిన పల్లె మధుబాబు(52) పని ఒత్తిడి భరించలేక మృతి చెందారు. ఇందుకు సంబంధించిన వివరాలు.. మధుబాబు గత కొన్నేళ్ల నుంచి ఆశాఖలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. నంద్యాల మండలం మిట్నాల గ్రామంలో ఆదర్శ పాఠశాలలో గతంలో నాడు– నేడు కింద అభివృద్ధి పనులు చేపట్టారు. కొన్ని నెలల నుంచి జరిగిన పనులపై పలు రకాలుగా ఒత్తిడికి లోనవుతున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. ఈ కారణంగానే కొన్ని రోజుల నుంచి మనో వేదనకు గురి అవుతున్నారు. పని ఒత్తిడి తాళలేక మనస్తాపం చెంది బుధవారం తెల్లవారుజామున అమ్మోనియం రసాయన ద్రావణం తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. విధి నిర్వహణలో పని ఒత్తిడి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకోవడంతో కోవెలకుంట్లలో విషాదచాయలు అలుముకున్నాయి. మిట్నాల పనుల విషయంలో కొందరు ఉన్నతాధికారులు, పాఠశాల విద్యా కమిటీ, ప్రిన్సిపాల్, సచివాలయ ఉద్యోగి, తదితరులు కొన్ని రోజుల నుంచి వేధింపులకు గురి చేస్తుండటంతోనే ఆత్మహత్య చేసుకున్నారని మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుని కుమారుడు మంజునాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు.


