భక్తిశ్రద్ధలతో నృసింహ దీక్ష
● 5వేల మందికి పైగా దీక్ష చేపట్టిన భక్తులు
ఆళ్లగడ్డ: శ్రీమద్ అహోబిలం శ్రీ లక్ష్మీనారసింహస్వామి దీక్షను భక్తులు భక్తిశ్రద్ధలతో చేపట్టారు. పారువేట ఉత్సవాల్లో భాగంగా స్వామి గ్రామాల్లో పర్యటించేందుకు బయలుదేరే రోజున దీక్షను ప్రారంభించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా గురువారం రాత్రికే దేశం నలుమూలల నుంచి అహోబిలం చేరుకున్న భక్తులు శుక్రవారం తెల్లవారు జామునే పుణ్యస్నానాలు ఆచరించి, పసుపు దుస్తులు ధరించి ఎగువ, దిగువ అహోబిలంలో వెలసిన మూలమూర్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం దిగువ అహోబిలం దేవాలయం ఎదురుగా యాగశాలలో ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను కొలువుంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య శ్రీసుదర్శన హోమం నిర్వహించారు. ఆ తర్వాత అర్చకులు దీక్షాపరులకు శ్రీ అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దీక్ష మాలలను వేసి ఆశీర్వదించారు. దీక్షాపరులు నేటి నుంచి 41 రోజులు నారసింహ స్వామి దీక్ష కొనసాగిస్తారు.


