కంది రైతు గగ్గోలు
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల ధర ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లో దళారీలు క్వింటా రూ.7వేల పైగా ధరతో కొంటున్నారు. కర్నూలు మార్కెట్‌కు తీసుకుపోతే మరింత మంచి ధర వస్తుందని ఆశించిన రైతులకు నిరాశే మిగులుతోంది. మార్కెట్‌కు శుక్రవారం 590 మంది రైతులు 4,254 క్వింటాళ్ల కందులు తెచ్చారు. 24 శాతం తేమ ఉన్న చిన్న కందుల లాట్‌కు రూ.7,300 ధర వేశారు. ఇదే అత్యదికం. 17 శాతం మాత్రమే తేమ ఉన్న లాట్‌కు రూ.6,350 ధర వేయడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలను పూర్తిగా తగ్గించడంతో ఆగ్రహించిన రైతులు మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ విషయమై మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి మాట్లాడుతూ మార్కెట్‌కు కందులు ఎక్కువగా వస్తున్నాయని, రైతులకు అన్యాయం జరుగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.


