క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు
కర్నూలు (టౌన్): క్రీడల్లో రాణిస్తే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రాయలసీమ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వి. వెంకట బసవరావు అన్నారు. కర్నూలులోని ఉస్మానియా కళాశాల క్రీడా మైదానంలో వర్సిటీ అంతర్ కళాశాలల బాల్‌బ్యాడ్మింటన్ టోర్నమెంట్ బుధవారం ప్రారంభమైంది. పోటీలకు అతిథిగా హాజరైన వైస్‌చాన్స్‌లర్ క్రీడాకారులను పరిచ యం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడల్లో ప్రతిభ చాటితే విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వస్తాయన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి. విజయ్‌కుమార్ నాయుడు, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ శివకిషోర్, ఉస్మానియా కళాశాల కరస్పాండెంట్ అజ్రా జావేద్, ప్రిన్సిపాల్ డాక్టర్ సయ్యద్ సమీయుద్దీన్ ముజమిల్ పాల్గొన్నారు.
హత్యకోణంలో విచారణ
గడివేముల: మండల కేంద్రమైన గడివేముల గ్రామానికి చెందిన ఓ యువకుడి అదృశ్యం కేసులో పోలీసుల విచారణ ముమ్మరం చేశారు. వినోద్ (21) గత ఏడాది ఆగస్టు 31 వ తేదీన నంద్యాలలో స్నేహితుల వద్దకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లాడు. రెండు రోజులైనా తిరిగి రాకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో తండ్రి రాజు ఫిర్యాదు చేయడంతో అప్పట్లో అదృశ్యం కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా పలు విషయాలు వెలుగుచూశాయి. వినోద్ బైక్‌ను బొల్లవరం రస్తాలోని ఎస్సార్‌బీసీ బ్రిడ్జి నుంచి కిందకు పడేసినట్లు అనుమానితులు చెప్పడంతో బుధవారం అక్కడికి వెళ్లి పరిశీలించగా బైకు కనిపించింది. దీంతో ఈ కేసును పోలీసులు హత్యకోణంలో విచారిస్తున్నారు.
నేడు మంత్రాలయానికి
పారిశ్రామికవేత్త అదానీ
కర్నూలు(సెంట్రల్): రాఘవేంద్రస్వామి దర్శనార్థం ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం మంత్రాలయం రానున్నారు. గుజరాత్‌లోని అహ్మద్‌బాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కర్నూలు ఎయిర్‌పోర్టుకు ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా మంత్రాలయం వెళతారు. దర్శనానంతరం తిరిగి అదే హెలికాప్టర్‌లోనే కర్నూలు ఎయిర్‌పోర్టు చేరుకొని అక్కడి నుంచి తిరుగుపయనమవుతారు.
ప్రభుత్వ వైఫల్యాలను
ప్రశ్నిస్తే కేసులా?
కర్నూలు(సెంట్రల్): ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారనే అక్కసుతోనే విశాఖపట్నంలో ఏఐవైఎఫ్, ఏఐఎస్‌ఎఫ్ సంఘాల నాయకులపై రౌడీషీట్, పీడీ యాక్ట్ ఓపెన్ చేశారని, ఇది చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనమని విద్యార్థి, యువజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బుధవారం సీఆర్ భవన్‌లో ఐక్య విద్యార్థి, యువజన సంఘాల వేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయా సంఘాల నాయకులు కె.శ్రీనివాసులు, సోమన్న, కె.భాస్కర్, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు రెడ్డిపోగు ప్రశాంత్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి, హనోక్ హాజరై మాట్లాడారు. విశాఖపట్నంలో ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులపై పెట్టిన రౌడీషీట్, పీడీ యాక్ట్ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ ప్రకారం జాబ్ క్యాలెండర్‌ను అమలు చేయాలని కోరిన విద్యార్థి, యువజన సంఘాల నాయకులపై కక్షపూరితగా కేసులు పెట్టడం అన్యాయమన్నారు. దీన్ని ఖండిస్తూ ఈనెల 9న విద్యార్థి, యు వజన సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. నాయకులు దుర్గ, నాగరాజు, శరత్‌కుమార్, అభి, అశోక్ పాల్గొన్నారు.
హ్యాకథాన్‌లో ప్రతిభ
కర్నూలు సిటీ: వీక్యూబ్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో బుధవారం జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద బూట్ క్యాంపు, హ్యాకథాన్, అల్డీనేట్ 2.0 విజయవంతంగా నిర్వహించారు. ఇందులో 400 మంది విద్యార్థులకుపైగా పాల్గొన్నారు. బూట్ క్యాంపులో 15 కాలేజీలకు చెందిన వెయ్యి మంది విద్యార్థులు పాల్గొనగా ప్రతిభ చూపిన వారిని హ్యాకథాన్‌కు ఎంపిక చేశారు. పరిశ్రమలకు అవసరమైన వనరుల నమూనాను విద్యార్థులు ఐఏని ఉపయోగించి అద్భుతంగా తయారు చేశారని వక్తలు ప్రసంశించారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకంతో పాటు, ప్రశంసా పత్రాలను అందజేశారు. వీక్యూబ్ సీఓఓ నాగేంద్ర రెడ్డి, ఎం.అంకాలరావు, ఎన్.వి.గణపతిరాజు, కృష్ణయ్య, ప్రిన్సిపాల్ బి.శ్రీనివాసరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
బాబువి చీకటి ఒప్పందాలు
జూపాడుబంగ్లా: సీఎం చంద్రబాబు చీక టి ఒప్పందాలు చేసుకుంటారని, అందులో భాగమే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల నిలిపివేత అని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రమేష్‌బాబు విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించేందుకు నేడు సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వ రయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.రామాంజనేయులు తదితరులు రానున్నట్లు బుధవారం విలేకరులకు తెలిపారు.
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు


