అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు
కర్నూలు: ప్రేమ పేరుతో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ కర్నూలు పోక్సో కోర్టు న్యాయమూర్తి ఇ.రాజేంద్రబాబు గురువారం తీర్పు చెప్పారు. 2020 సంవత్సరంలో నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలో ఎన్‌హెచ్–40 రోడ్డు పక్కన హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్న కుటుంబంతో పాణ్యంలో నివాసముంటున్న పఠాన్ రహంతుల్లా పరిచయం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే వారింట్లోని ఓ మైనర్ బాలిక(16)తో చనువుగా ఉంటూ పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఒంటరిగా ఉన్న సమయంలో మైనర్ బాలికను శారీరకంగా దగ్గరయ్యాడు. విషయం ఎవరికీ చెప్పవద్దని, త్వరలో పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో 2020 నవంబర్ 2న తనకు గర్భం వచ్చిందని బాలిక చెప్పగా తన మోటర్ సైకిల్‌పై బాలికను నెల్లూరుకు తీసుకెళ్లాడు. కొన్నాళ్ల తర్వాత మీ ఇంట్లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుందామని పాణ్యంకు పిలిచుకువచ్చి హోటల్ ముందు బాలికను దించి వెళ్లిపోయాడు. జరిగిన విషయాన్ని మైనర్ బాలిక తల్లితో కలసి పాణ్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు పఠాన్ రహంతుల్లాపై కిడ్నాప్, అత్యాచారంతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. కోర్టులో చార్జిషీటు దాఖలు చేయగా కేసు విచారించిన న్యాయస్థానం నిందితుడిపై మోపిన అభియోగాలు నిరూపణ కాగా 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.


