పీజీఆర్‌ఎస్ అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలి
కర్నూలు(సెంట్రల్): పీజీఆర్‌ఎస్‌లో వచ్చే అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్జీలను సంతృప్త స్థాయిలో పరిష్కరించేందుకు నోడల్ అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. అర్జీదారుడితో నేరుగా మాట్లాడి సరైన ఎండార్స్‌మెంట్ ఇవ్వాలన్నారు. పత్రికల్లో వచ్చే ప్రతికూల వార్తలపై సంబంధిత అధికారులు వేగంగా స్పందించి నివేదికను పంపాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో సుమారు 450 మంది గైర్హాజరవుతున్నట్లు తెలుస్తోందని, వారిని తిరిగి పాఠశాలలకు రప్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, గృహ నిర్మాణ అధికారి చిరంజీవి, ఎస్‌డీసీలు అనురాధ, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.


