ఉమెన్స్ వన్డే క్రికెట్ పోటీలకు కౌసల్య ఎంపిక
కర్నూలు(టౌన్)/వెల్దుర్తి: ముంబైలో బీసీసీఐ ఈనెల 13 నుంచి 21వ తేదీ వరకు నిర్వహిస్తున్న అండర్–19 ఉమెన్స్ వన్డే క్రికెట్ టోర్నమెంట్‌కు వెల్దుర్తి మండలం ఎల్. బండ గ్రామానికి చెందిన మహిళా క్రికెటర్ కౌలస్య ఎంపికయ్యారు. వన్డే పోటీలకు ఎంపికై న క్రీడాకారిణిని క్రికెట్ కోచ్ శేఖర్, జిల్లా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు దేవేంద్రగౌడ్, రమేష్ సోమవారం అభినందించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా కేడీసీఎ కోచ్ శ్రీనివాసులు ఎంపికై నట్లు క్రికెట్ వర్గాలు ధృవీకరించాయి.
డిగ్రీ పరీక్షలకు
89 శాతం హాజరు
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహిస్తున్న డిగ్రీ మూడో సెమిస్టర్ పరీక్షల్లో 89 శాతం హాజరు నమోదైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 19 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తుండగా సోమవారం జరిగిన పరీక్షలకు 385 మందికి 342 మంది హాజరైనట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. కర్నూలు శ్రీ సాయికృష్ణ డిగ్రీ కళాశాలలో చూచిరాతకు పాల్పడిన ఒక విద్యార్థిని డిబార్ చేశామన్నారు.
పీఎం కిసాన్‌కు ఈ–కేవైసీ చేయించుకోండి
కర్నూలు(అగ్రికల్చర్): కొంతమంది రైతులు ఆధార్ ఈ–కేవైసీ చేయించుకోకపోవడం వల్ల పీఎం కిసాన్ కింద సాయం పొందలేకపోయారని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు. ఇలాంటి రైతులు సమీపంలోని మీ సేవా కేంద్రం/కామన్ సర్వీస్ సెంటర్లలో సత్వరం ఈ–కేవైసీ చేయించుకోవాలని సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. మరికొంత మంది రైతులు బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ చేయించుకోనందున పీఎం కిసాన్ లబ్ధి పొందలేదన్నారు. ఇలాంటి రైతులు సంబంధిత బ్యాంకు, పోస్టాఫీసుల్లో సంప్రదించి ఖాతాకు ఆధార్ లింక్ చేయించుకోవాలన్నారు. 2019 ఫిబ్రవరి 1 తర్వాత మ్యుటేషన్ చేయించుకున్న వారికి కూడా పీఎం కిసాన్ లబ్ధి వర్తించలేదన్నారు. కుటుంబం యూనిట్‌గా ఒక్కరికి మాత్రమే పథకం వర్తిస్తుందన్నారు.
మైనర్ డ్రైవింగ్‌పై
కేసు నమోదు
కర్నూలు: కర్నూలు బళ్లారి చౌరస్తా సమీపంలోని తిలక్‌నగర్‌లో నివాసముంటున్న వెంకటేష్ కుమారుడు ఉదయ్ (16)పై మైనర్ డ్రైవింగ్ కేసు నమోదైంది. వెంకటేష్ కుటుంబ సభ్యులు స్థానికంగా తోపుడు బండిపై టిఫిన్ సెంటర్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఉదయ్ తన స్నేహితులు అశోక్, హరితో కలసి ఈనెల 6వ తేదీ రాత్రి బళ్లారి చౌరస్తా దగ్గర్నుంచి బుల్లెట్ కేఫ్ దగ్గర ఉన్న ఢాబాకు ద్విచక్ర వాహనంపై వెళ్తూ లారీ క్లీనర్ మగ్బూల్ రోడ్డు దాటుతుండగా ఢీకొట్టారు. దీంతో అతను తీవ్ర గాయాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 7వ తేదీ రాత్రి మృతిచెందాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉదయ్‌పై తాలూకా పోలీసులు మైనర్ డ్రైవింగ్ కేసు నమోదు చేశారు. ద్విచక్ర వాహనం ఉదయ్ సోదరుడు శివశంకర్ పేరుతో ఉండటంతో అతనిపై కూడా కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
కర్నూలు(అగ్రికల్చర్): సహకార సంఘాల ఉద్యోగులకు జీవో 36 ప్రకారం హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఉద్యోగుల యూనియన్‌ల ఐక్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు. పెండింగ్‌లోని డిమాండ్‌లు, వివిధ సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరుతూ సోమవారం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు బ్రాంచీల ఎదుట ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నెల 6 నుంచి ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సోమవారం ఉమ్మడి జిల్లాలో ని 18 డీసీసీబీ బ్రాంచీల ఎదుట ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. డిమాండ్‌లపై నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఉద్యోగులందరికీ ప్రొసీడింగ్స్ ఇచ్చి డీఎల్‌ఎస్‌ఎఫ్ ద్వారా జీతభత్యాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని తీసుకోవాలని యూనియన్ జిల్లా అధ్యక్షుడు హరీఫ్‌బాషా డిమాండ్ చేశారు. వేతన సవరణ కొలిక్కి వచ్చే వరకు మధ్యంతర భృతి ఇవ్వాలన్నారు. అనంతరం ఆయా బ్రాంచ్ మేనేజర్లకు వినతి పత్రాలు సమర్పించారు.
ఉమెన్స్ వన్డే క్రికెట్ పోటీలకు కౌసల్య ఎంపిక


