ప్రశాంతంగా ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష
కర్నూలు సిటీ: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్)పరీక్షను ఆదివారం ప్రశాంతంగా నిర్వహించారు. 8వ తరగతి విద్యార్థులు రాసే ఈ పరీక్షకు జిల్లాలో కర్నూలులో ఆరు, ఆదోనిలో 9, పత్తికొండలో 9 కేంద్రాల ఏర్పాటు చేశారు. మొత్తం 4,124 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 3,960 మంది హాజరయ్యారు. కర్నూలు బీక్యాంపు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని డీఈఓ ఎస్.శామ్యూల్ పాల్ తనిఖీ చేశారు.
21న ‘పల్స్‌పోలియో’
కర్నూలు(హాస్పిటల్): చిన్నారులు పోలియోబారిన పడకుండా ఈ నెల 21న పల్స్‌పోలియో చుక్కల మందు కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఉమ తెలిపారు. జిల్లాలో ఐదేళ్లలోపు 3,52,164 మంది చిన్నారులు ఉన్నారని, వీరందరికీ పోలియో చుక్కలు వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఈ మేరకు ముందస్తు ప్రణాళికలో భాగంగా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. 21న పోలియో కేంద్రాల్లో పల్స్‌పోలియో కార్యక్రమం ఉంటుందని, ఆ తర్వాత 22, 23వ తేదీల్లో ఇంటింటికి తిరిగి వైద్య సిబ్బంది పోలియో చుక్కలు వేస్తారన్నారు. ఇందుకోసం జిల్లాలో 35 పీహెచ్‌సీలు, 28యుపీహెచ్‌సీల పరిధిలో 1600 బూత్‌లు ఏర్పాటు చేశామన్నారు. 52 ట్రాన్సిట్, 63 మొబైల్ కేంద్రాల ద్వారా ఆరుగురు డిస్ట్రిక్ట్ హెల్త్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారని తెలిపారు. వీరితో పాటు 160 మంది సూపర్‌వైజర్లు, 39 మంది వ్యాక్సిన్ మేనేజర్లు, 6,400 మంది వ్యాక్సినేటర్లు కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు.
12న అంగన్‌వాడీల సమ్మె
వెల్దుర్తి: అంగన్‌వాడీ సంఘాల ఐక్య ఉద్యమంలో భాగంగా ఈనెల 12న ఒక్క రోజు సమ్మె చేపట్టనున్నట్లు ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోషియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే లలిత తెలిపారు. వెల్దుర్తిలో ఆమె ఆదివారం విలేకరులతో మాట్లాడారు. సమ్మెలో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని 1,05,000 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు సమ్మెలో పాల్గొనబోతున్నట్లు వివరించారు. గుజరాత్ హైకోర్టు అంగన్‌వాడీ వర్కర్లను, హెల్పర్లను 4వ తరగతి, 3వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని తీర్పునిచ్చిందని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అహోబిలం దేవస్థానం ఏఓగా వీఎల్‌ఎన్ రామానుజన్
చాగలమర్రి: అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా నియమితులైన వీఎల్‌ఎన్ రామానుజన్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అహోబిలం మఠం పీఠాధిపతి శ్రీరంగనాథ యతీంద్ర దేశికన్ ఆదేశాలు పాటిస్తూ భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తామన్నారు.


