భూ వివాదంలో వ్యక్తిపై దాడి
కర్నూలు సిటీ: కర్నూలు రూరల్ తహసీల్దారు కార్యాలయం ఆవరణలో భూ వివాదంలో చోటు చేసుకున్న ఘర్షణలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కర్నూలు రూరల్ మండల పరిధిలోని భూపాల్ నగర్‌కు చెందిన రవి శంకర్ గౌడు, మిలటరీ కాలనీకి చెందిన గోపాల్, మరో ఇద్దరి మధ్య గత కొన్ని నెలలుగా రుద్రవరం గ్రామ పరిధిలోని సర్వే నంబరు 608హెచ్ అసైన్డ్ భూమి వివాదం నెలకొంది. ఈ వివాదంలో పరస్పర ఫిర్యాదులతో ఇరువురుకి తహసీల్దార్ రమేష్ బాబు నోటీసులు ఇచ్చి శుక్రవారం తుది విచారణకు హాజరు కావాలని సూచించారు. ఇందులో భాగంగా ఉదయం 11 గంటలకు వారు కార్యాలయానికి చేరుకున్నారు. ఆ సమయంలో గురునాథ్, గోపాల్, మరి కొంత మంది తనపై రాడ్లతో దాడి చేశారని రవి శంకర్ గౌడు తలకు తీవ్ర గాయంతోనే తహసీల్దార్ ఆఫీస్‌లోకి వచ్చాడు. గమనించిన తహసీల్దారు 2వ పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని రవి శంకర్ గౌడును చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రెండవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పరస్పర ఫిర్యాదులతో విచారణ
608హెచ్ అనే సర్వే నెంబరులో సుమారు 360 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులకు, మరి కొంత మందికి 2002లో అసైన్డ్ పట్టాలు ఇచ్చారు. ఇందులో భాగంగా గోపాల్‌కు 2.50 ఎకరాలు, రవిశంకర్ గౌడుకు 3.50 ఎకరాలకు డీ పట్టాలు ఇచ్చారు. ఈ భూములకు సమీపంలోనే చైన్నె–సూరత్ హైవే రావడంతో డిమాండ్ పెరిగింది. గోపాల్, రవిశంకర్ గౌడుల భూములు పక్కపక్కనే ఉన్నాయి. తన భూమిలో నుంచి 87 సెంట్ల భూమి ఆక్రమించారని గోపాల్, పౌలన్న, హూసేనమ్మలపై రవి శంకర్ గౌడు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై తహసీల్దారు విచారణ చేపట్టగా గోపాల్.. రవిశంకర్ గౌడుపై పలు ఆరోపణలతో ఫిర్యాదు చేశారు. ఫిర్యా దులు ఫైనల్ హియరింగ్ శుక్రవారం ఉండగా.. ఈ దాడి చోటు చేసుకుంది. ఆ తరువాత తహసీల్దారు రమేష్ బాబు ఘటనకు కారణమైన భూవివాదం, పరస్పర ఫిర్యాదులపై మీడియాకు వివరించారు.


