ఆదోని జిల్లాతోనే అభివృద్ధి సాధ్యం
ఆదోని టౌన్: వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఆంధ్రా ముంబయిగా వెలుగొందిన ఆదోని నేడు వెనుకబాటుకు నిలయంగా మారిందని, జిల్లాగా ప్రకటిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రాల యం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అన్నారు. ఆదోని జిల్లా సాధన కమిటీ సభ్యులు ఆదినారాయణ రెడ్డి, వీరశైవ యువజన విభాగం శ్రేణులు మధు నేతృత్వంలో దీక్షా శిబిరం మంగళవారం పట్టణంలోని భీమాస్ సర్కిల్‌లో చేపట్టారు. శిబిరాన్ని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. దీక్ష చేపట్టిన యువతకు పూలమాలలు వేసి అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదోని చుట్టూ ఐదు మండలాల పరిధిలో కరువు కాటేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చీమకుట్టినట్లుగా కూడా లేదన్నారు. ఆదోనిని జిల్లాగా ప్రకటిస్తే అభివృద్ధితో పాటు పరిశ్రమలు ఏర్పాటై ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కూటమి ప్రభుత్వం ఆదోని ఆవశ్యకతను పార్టీలకు అతీతంగా కుల, రాజకీయ, ప్రజా, మహిళా సంఘాలు, నిరుద్యోగులు అన్నివర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ ప్రాంతం ఏడారిగా మారక మునుపే జిల్లాగా ప్రకటించి అభివృద్ధి దిశగా నడిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. శిబిరంలో వీరశైవ యువజన సంఘం నాయకులు దేవిశెట్టి రవి, చరణ్, మంజునాథ్, అరవింద్‌తో పాటు మరికొంతమంది పాల్గొన్నారు.


