రోగుల సహాయకులకు విశ్రామ్ సదన్
● రూ.14.6కోట్లతో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ నిర్మాణం ● జీజీహెచ్‌లో 150 పడకలతో ఏర్పాటు ● 18 నెలల్లో పూర్తి చేసేందుకు ప్రణాళిక
కర్నూలు(హాస్పిటల్): వివిధ ప్రాంతాల నుంచి చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారు. అయితే, వీరికి సహాయంగా ఉండేందుకు వచ్చిన వారు ఉండేందుకు ప్రస్తుతం ఈ వైద్యశాలలో ఎక్కడా ఎలాంటి ఏర్పాట్లు లేవు. నాలుగు షెడ్లు ఉన్నా అందులో రెండింటిని ఇతర అవసరాలకు వాడుకుంటున్నారు. ఫలితంగా వందలాది మంది రాత్రిళ్లు చలిలో, దోమలతో నిత్యం నరకం చూడాల్సి వస్తోంది. వీరి ఇబ్బందులను గ్రహించిన పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ వారు రూ.14.6కోట్ల సీఎస్‌ఆర్ నిధులతో ఎన్‌బీసీసీ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఆవరణలోని స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ప్రాంతంలో ‘విశ్రామ్ సదన్’ పేరుతో భారీ వసతి గృహం నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జీ ప్లస్ 3 అంతస్తుల విధానంలో దీని నిర్మాణం జరగనుంది. దీనిని 150 పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఇందులో సింగిల్ రూములు, డబుల్ రూములు, డార్మిటరీలు, మహిళా వసతి గదులు, దూరప్రాంతాల నుంచి వచ్చే రోగుల బందువులకు సురక్షితమైన, పరిశుభ్రమైన వసతి అందించనున్నారు. ప్రతి అంతస్తులులో సౌకర్యవంతమైన గదుల విభజన, సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. 18 నెలల్లో ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇందుకు సంబంధించి మంగళవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లుతో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీనివాసమూర్తి, అబ్దుల్ రహీం, నేషనల్ బిల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బిల్డింగ్ ఆర్కిటెక్ట్ హర్షవర్దన్ చర్చించారు. త్వరలో ఇందుకు సంబంధించిన నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు ప్రతినిధులు చెప్పారు.
అంతదూరం వెళ్తారా !
కాగా సువిశాలమైన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఒక్కో విభాగం ఒక్కో చోట ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం నిర్మించనున్న విశ్రామ్ భవన్ నుంచి ఏ విభాగానికి వెళ్లాలన్నా అర కిలోమీటర్ దూరం వెళ్లాల్సి ఉంటుంది. రోగులకు ఏదైనా అవసరం అయితే ఆయా విభాగాల ఎదురుగా ఉంటే వెంటనే వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రోగుల సహాయకులు ఆయా విభాగాల వద్దే ఎండావాన, చలిని లెక్క చేయకుండా వేచి ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారు అరకిలోమీటర్ దూరంలో నిర్మించే భవనంలో ఉంటారన్న నమ్మకం లేదని కొందరు అధికారులే చర్చించుకుంటున్నారు. ఆసుపత్రి ఎదురుగా ఉండే శాలమ్మ సత్రం కూడా రోగుల సహాయకుల విశ్రాంతికి ఉద్దేశించి నిర్మించిన భవనమే. ఇందులోనూ కనీస రుసుముతో రోగుల సహాయకులు ఉండే అవకాశం ఉంది. అయితే ఈ గదుల గురించి రోగుల సహాయకులకు చెప్పడంలో ఆసుపత్రి సిబ్బంది విఫలం అవుతున్నారు. ఈ కారణంగా ఎప్పుడూ ఆ గదులు ఖాళీగానే ఉంటున్నాయి. ముందుగా వీటిని వినియోగంలోకి తెస్తే రోగుల సహాయకులకు ఉపయోగకరంగా ఉంటుందని పలువురు వైద్యులు సూచిస్తున్నారు.
రోగుల సహాయకులకు విశ్రామ్ సదన్


