రికార్డు స్థాయిలో మల్లన్న హుండీ ఆదాయం
● గతేడాది కంటే రూ.1.31కోట్లు అధికం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మల్లన్నకు కార్తీక మాసంలో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. మంగ ళవారం చంద్రవతి కల్యాణ మండపంలో ఉభయ దేవాలయాలలో భక్తు లు సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు రూపంలో రూ.7,27,26,400 లభించినట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. కార్తీకమాసంలో ఇంత అధిక మొత్తంలో హుండీ ఆదాయం లభించడం ఇదే మొదటిసారి కావడం విశేషమన్నారు. ఈ రాబడిని భక్తులు గత 33 రోజుల్లో సమర్పించారన్నారు. గతేడాది కార్తీకమాసంలో రూ.5,96,92,376 నగదు లభించిందన్నారు. గత సంవతర్సరం కార్తీక మాసం కంటే ఈ సంవత్సరం రూ.1,30,34,024 అధిక రాబడి వచ్చిందన్నారు. అలాగే హుండీలో 117.800 బంగారం, 7.230 కేజీల వెండి, మరికొంత విదేశీ కరెన్సీ లభించిందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కార్యనిర్వహ ణాధికారి ఆర్.రమణమ్మ, దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ హరిచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


