అంతర పంటలతో అదనపు ఆదాయం
వెల్దుర్తి: అంతర పంటలతో రైతులు అదనపు ఆదాయం పొందవచ్చునని వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) జిల్లా పీడీ శ్రీలత పేర్కొన్నారు. మండల పరిధిలోని బింగిదొడ్డి గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో జిల్లా వనరుల కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం రైతు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఆమె మాట్లాడుతూ పత్తి, కంది ఇతరత్రా ప్రధాన దీర్ఘకాలిక పంటలు, పండ్ల తోటల్లో అంతర పంటలుగా ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు సాగు చేయాలన్నారు. దీని వల్ల అదనపు ఆదాయంతోపాటు ప్రధాన పంటకు చీడపీడల నివారణ, భూసారం మెరుగవుతుందన్నారు. జిల్లా ఏరువాక కేంద్రం డాక్టర్ వైఎస్ సతీష్, జిల్లా వనరుల కేంద్రం ఏడీఏ వెంకటేశ్వర్లు, పత్తికొండ ఏడీఏ మోహన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ భూసార పరీక్షల ఆవశ్యకత, సమగ్ర ఎరువుల యాజమాన్యం, నానో యూరియా పిచికారీ, కపాస్ కిసాన్ యాప్‌పై అవగాహన కల్పించారు. అనంతరం క్షేత్ర సందర్శనలో భాగంగా గ్రామంలో సాగు చేసిన కంది పంటను పరిశీలించి పంటకు ఆశించిన మచ్చల పురుగు నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. అనంతరం మదార్‌పురం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన బయో ఇన్‌పుట్ రిసోర్స్ సెంటర్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో ఏఓ అక్బర్‌బాషా, బింగిదొడ్డి గ్రామ సర్పంచ్ వెంకటేశ్వరమ్మ, జిల్లా వనరుల కేంద్రం ఏఓ వెంకట రంగారెడ్డి, ప్రకృతి వ్యవసాయ శాఖ మండల ఇన్‌చార్జ్ జనార్ధన్, ఆర్‌ఎస్‌కే సిబ్బంది లింగన్న పాల్గొన్నారు.


