వేదభూమిలో కనుల పండువగా తుంగా హారతి
● లక్ష దీపోత్సవంతో కాంతులీనిన
నదీ తీరం
తుంగా హారతిలో ప్రజల భక్తిభావం, తుంగభద్రమ్మకు కార్తీక హారతి ఇస్తున్న శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు
మంత్రాలయం: కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం మంత్రాలయంలో తుంగా హారతి కార్యక్రమం కనుల పండువగా సాగింది. వేడుకల్లో భాగంగా శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి శ్రీమఠం పీఠాధిపతి సుబుదేంధ్ర తీర్థులు కార్తీక పూజోత్సవం చేశారు. అనంతరం వేద పాఠశాల విద్యార్థుల వేద పఠనంతో మేళతాళాలతో ఉత్సవమూర్తి ప్రహ్లాద రాయలు ఊరేగింపుగా తుంగభద్ర నది చెంతకు తీసుకొచ్చారు. ప్రత్యేక వేదికపై కొలువుంచిన అనంతరం పీఠాధిపతి కార్తీక సందేశాన్ని ప్రవచించారు. ఉత్సవమూర్తికి విశేష పూజలు నిర్వహించి కార్తీక హారతి పట్టి తుంగా హారతికి అంకురార్పణ పలికారు. అర్చకులు వేద పఠనం చేస్తూ తుంగభద్రమ్మకు శాస్త్రోక్తంగా నక్షత్ర హారతులు పట్టారు. అంతకు ముందు ఉత్సవమూర్తికి తెప్పోత్సవం కానిచ్చారు. పీఠాధిపతుల తెప్పపై కొలువైన ప్రహ్లాద రాయలకు పుష్పాభిషేకం చేశారు. భక్తులు నదితీరంలోనికి పుష్కర ఘాట్లు పై లక్ష దిపోత్సవం నిర్వహించారు. ఏఏఓ మాధవ శెట్టి మేనేజర్లు శ్రీనివాస రావు, వెంకటేష్ జోషి, శ్రీపతి ఆచార్ పాల్గొన్నారు.
వేదభూమిలో కనుల పండువగా తుంగా హారతి


