ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ పీఆర్ అండ్ ఆర్‌డీ కమిషనర్ కృష్ణతేజ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచాయతీల్లో ఆన్‌లైన్‌లో పన్నుల చెల్లింపునకు సంబంధించి ఇళ్ల యజమానుల పేర్లు, వాళ్ల మొబైల్ నెంబర్లను స్వర్ణ పంచాయత్ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాక వందల ఇళ్ల యజమానులకు ఒకే ఫోన్ నెంబర్‌ను నమోదు చేయడాన్ని పీఆర్ అండ్ ఆర్‌డీ ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే నంద్యాల జిల్లా బనగానపల్లె గ్రామ పంచాయతీ గ్రేడ్–2 పంచాయతీ కార్యదర్శి బి.సతీష్‌కుమార్ రెడ్డి, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కోటేకల్ గ్రామ పంచాయతీ గ్రేడ్–4 పంచాయతీ కార్యదర్శి ఫరీద్ అహ్మద్‌ను కమిషనర్ సస్పెండ్ చేశారు. అలాగే వీరిద్దరూ సంబంధిత అధికారుల అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్‌ను విడిచి వెళ్లరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అక్రమ అడ్మిషన్ ఫీజు వసూళ్లపై విచారణ
ఎమ్మిగనూరుటౌన్: పట్టణంలోని మాచాని సోమప్ప బాలికల జెడ్పీ హైస్కూల్‌లో విద్యార్థుల నుంచి అక్రమంగా అడ్మిషన్ ఫీజు వసూలు చేశారన్న ఫిర్యాదులపై బుధవారం కడప ఆర్జేడీ శామ్యూల్, డీఈఓ శామ్యూల్‌పాల్ విచారణ జరిపారు. పాఠశాలలో విద్యార్థులతో, ఉపాధ్యాయినులతో వేర్వేరుగా మాట్లాడారు. విచారణ రోజున ఆరోపణలు వచ్చిన హెచ్‌ఎం కృష్ణమూర్తి సెలవులో ఉన్నారు. విచారణ జరిపామని, తదుపరి చర్యలు తీసుకొంటామని ఆర్జేడీ తెలిపారు. డిప్యూటీ డీఈఓ వెంకటరమణారెడ్డి, ఎంఈఓలు ఆంజినేయులు, మధుసుదన్‌రాజు, గోనెగండ్ల ఎంఈఓ రామాంజనేయులు పాల్గొన్నారు.
ఇసుకను తోడేస్తున్నారు
కౌతాళం: కూటమి నాయకుల అండదండలుంటే చాలు అనుమతులతో పనిలేదు. చలానాలు అస్సలు అక్కర్లేదు. ఎంతైనా ఇసుక తీసుకెళ్లవచ్చు. కౌతాళం మండలం నదిచాగి ఇసుక రీచ్‌లో సాగుతున్న దందా ఇదే. అడిగే వారు ఎవరూ లేరని అక్రమార్కులు యథేచ్ఛగా ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్నారు. ఇటీవల నదికి నీరు రావడంతో గుడికంబాలి, మరళి గ్రామాల రీచ్‌ల్లో ఇసుక తరలింపును తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో కూటమి నాయకులు, వారి అనుచరులు, మద్దతుదారులు నదిచాగి రీచ్ వద్ద ట్రాక్టర్లతో వాలిపోతున్నారు. కనిపించిన ఇసుకనంతా తోడుకొని ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. బుధవారం పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరిగినా ఏ ఒక్క అధికారి అటు వైపు తొంగి చూడకపోవడం గమనార్హం.
శ్రీశైల భ్రామరికి లక్ష కుంకుమార్చన
శ్రీశైలంటెంపుల్: అష్టాదశ శక్తిపీఠంగా వెలసిన శ్రీశైల శ్రీ భ్రమరాంబాదేవికి కార్తీకపౌర్ణమి సందర్భంగా బుధవారం లక్ష కుంకుమార్చన పూజలను నిర్వహించారు. లక్ష కుంకుమార్చన పూజలో భాగంగా అర్చకులు, పండితులు ముందుగా పూజా సంకల్పాన్ని పఠించారు. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజను నిర్వహించారు. అనంతరం లక్ష కుంకుమార్చనను జరిపించారు.
ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్


