రేషన్ బియ్యం పట్టివేత
గడివేముల: మండల పరిధిలోని కరిమద్దెల గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. సమాచారం మేరకు వారు గ్రామానికి చెందిన సింగారి ప్రసాదరావు ఇంట్లో తనిఖీలు నిర్వహించి 1,350 కేజీల రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించి సీజ్ చేశారు. ప్రసాదరావుపై కేసు నమోదు చేసినట్లు తహసీల్దార్ వెంకటరమణ బుధవారం తెలిపారు. నిరుపేదలకు అందాల్సిన బియ్యాన్ని ఎవరైనా పక్కదారి పట్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
కొత్తూరులో సామూహిక ఒడిబియ్యం
● వేలాదిగా తరలివచ్చిన మహిళలు
పాణ్యం: మండల పరిధిలోని కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో బుధవారం సామూహిక ఒడిబియ్యం కార్యక్రమం నిర్వహించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయ ప్రధాన అర్చకులు పుల్లయ్యశర్మ, వీరయ్యశర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుమారు 4వేల మంది సంతానం లేని మహిళలు తరలివచ్చారు. దైవ సన్నిధిలో సాముహిక ఒడిబియ్యం పోసుకుంటే సంతానం కలుగుతుందని వారి నమ్మకం. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం తెల్లవారుజామున శ్రీ వల్లి సుబ్రమణ్యేశ్వర సమేత ఉత్సవమూర్తులకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.తర్వాత ఆలయ ప్రాంగణంలో మహిళలకు నూతన వస్త్రాలు అందించి ఒడిబియ్యం పోశారు. నంద్యాల ఎస్‌డీపీఓ మంద జావళి ఆలయంలో భక్తులకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. శాంతిరామ్ ఆసుపత్రి వారు ఉచిత మెడికల్ క్యాంప్‌ను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించారు.
రేషన్ బియ్యం పట్టివేత


