జర్నలిస్టుల సమస్యలపై పోరుబాట
కర్నూలు(సెంట్రల్): జిల్లాలోని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్(ఏపీడబ్ల్యూజేఎఫ్) ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి బి.మద్దులేటి, రాష్ట్ర కమిటీ సభ్యుడు గోరంట్లప్ప పేర్కొన్నారు. బుధవారం సమాచార శాఖ కార్యాలయ ఆవరణలో ఏపీడబ్ల్యూజేఎఫ్ 19వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సంఘం నగర అధ్యక్ష, కార్యదర్శులు ఎం.శివశంకర్, ఎర్రమల అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి బి.మద్దులేటి, రాష్ట్ర కమిటీ సభ్యుడు గోరంట్లప్పతో పాటు సమాచార పౌర సంబంధాల శాఖ డెప్యూటీ డైరక్టర్ జయమ్మ ముఖ్య అతిథులుగా హాజరై కేకు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. నిరంతరం జర్నలిస్టుల సమస్యల కోసం పోరాడుతున్న ఏపీడబ్ల్యూజేఎఫ్ మరెన్నో ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యుడు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకొచ్చి 17 నెలలు అవుతున్నా ఒక్క సమస్యను పరిష్కరించలేదన్నారు. అధికారంలో లేని సమయంలో కూటమి నాయకులు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాన్ భ్రమలు కల్పించి మోసం చేశారని విమర్శించారు. ఇప్పటి వరకు ఎందుకు జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు మంజూరు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల విషయంలోనూ కూటమి ప్రభుత్వ నేతలు పూటకోమాట మాట్లాడుతున్నారని విమర్శించారు మరోవైపు ఎక్కడికక్కడే మీడియా స్వేచ్ఛను హరిస్తూ జర్నలిస్టులపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు. జర్నలిస్టుల రక్షణ చట్టం తేవాలని కోరుతున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. సమాచార శాఖ డీడీ జయమ్మ మాట్లాడుతూ..జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. త్వరలోనే అక్రిడిటేషన్‌లు, ఇళ్ల స్థలాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు. కార్యక్రమలో సీనియర్ ఫొటోగ్రాఫర్ డి.హుస్సేన్, ప్రజాశక్తి ఎడిషన్ ఇన్‌చార్జి పానుగంటి చంద్రయ్య, సీనియర్ రిపోర్టర్లు చంద్రశేఖర్, వినయ్‌కుమార్, చంద్రమోహన్, రవిప్రకాష్, రామకృష్ణ, ప్రతాప్, అనిల్, మణిబాబు, నర్సిరెడ్డి, భాస్కరరావు, బాలకృష్ణ, ఓర్వకల్ మధు తదితరులు పాల్గొన్నారు.


