జీవితంపై విరక్తితో..
● చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకేసు
ముద్దాయిల తండ్రి ఆత్మహత్య
కృష్ణగిరి: కృష్ణగిరి మండలం తొగర్చెడు గ్రామానికి చెందిన బోయ బజారి(66) మంగళవారం ఆత్మహత్మ చేసుకున్నాడు.ఇతను పత్తికొండ వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న బోయ బాలకేశన్న, బోయ రామాంజనేయులు తండ్రి. ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపిన వివరాల మేరకు.. భార్య వెంకటలక్ష్మమ్మతో కలిసి తొగర్చెడులో బోయబజారి జీవిస్తున్నాడు. ముగ్గురు కుమారులు బోయ బాలకేశన్న, బోయ రామాంజనేయులు, బోయ రామానాయుడు 2017లో మండల కేంద్రానికి చేరువలో జరిగిన చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో ముద్దాయిలు. వీరిలో రెండో కుమారుడు బోయ రామాంజనేయులు హత్య కేసు విచారణ సందర్భంలోనే ఆరేళ్ల క్రితం ఆత్యహత్య చేసుకున్నాడు. మిగిలిన ఇద్దరు కుమారులకు కర్నూలు కోర్టు ఇటీవల జీవిత ఖైదు విధించింది. దీంతో వారు కడప సెంట్రల్ జైల్‌లో శిక్ష అనుభవిస్తున్నారు. ఒకవైపు అనారోగ్యం, మరో వైపు ఉన్న ముగ్గురు కుమారుల్లో ఒకడు చనిపోయి, మరో ఇద్దరు జైలులో ఉండడంతో బజారికి చూసుకునే వారు కరువయ్యారు. ఈ క్రమంలో ఎవరి కోసం జీవించాలని మనస్థాపం చెంది తన ఇంటి ముందు ఉన్న పశువుల కొట్టంలో ఉరివేసుకున్నాడు. మృతుడి భార్య వెంకట లక్ష్మమ్మ బుధవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. గురువారం జరిగే మృతుడి అంత్యక్రియల్లో ఒక కుమారుడిని మా త్రమే పాల్గొనేందుకు జైలు అధికారులు అనుమతి ఇచ్చినట్లు సమాచారం.
9న యాదవుల కార్తీక వనభోజనం
కర్నూలు (సెంట్రల్): యాదవుల కార్తీక వన భోజన కార్యక్రమాన్ని ఈ నెల 9వ తేదీన నిర్వహించనున్నట్లు సంఘం నాయకులు డాక్టర్ బాలమద్దయ్య, పీజీ నరసింహులుయాదవ్, శేషఫణి యాదవ్, నాగేశ్వరరావు యాదవ్ తెలిపారు. బుధవారం ఆర్‌ఆర్ హాస్పిటల్‌లో యాదవుల వనభోజన కార్యక్రమం పోస్టర్‌ను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. జగన్నాథగట్టు రూపా ల సంగమేశ్వరస్వామి ఆలయ ఆవరణలో ఉదయం 10 గంటల నుంచి వనభోజన మహోత్సవం ఉంటుందన్నారు. యాదవ కుటుంబ సభ్యులందరూ హాజరై విందు స్వీకరించాలని కోరారు. సమావేశంలో నాయకులు సదానంద యాదవ్, సీతారాం యాదవ్, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.
జీవితంపై విరక్తితో..


