బాలల సంరక్షణ పట్ల నిర్లక్ష్యం వద్దు
కర్నూలు(అర్బన్): జిల్లాలోని బాలల సంరక్షణ కేంద్రాల్లోని చిన్నారుల పట్ల ఎలాంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించకుండా జాగ్రత్తగా చూసుకోవాలని జిల్లా స్థాయి ఇన్‌స్పెక్షన్ కమిటీ సూచించింది. జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ఆదేశాల మేరకు జిల్లా బాలల సంరక్షణ అధికారి టి.శారద, జువైనల్ జస్టిస్ బోర్డ్ సభ్యురాలు ఎస్.మాధవి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు కె.మధుసుధాకర్, ఎన్‌జీఓ లయన్ రాయపాటి శ్రీనివాస్, తాండ్రపాడు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మంజుష, సైకాలజిస్డ్ డాక్టర్ కె.చంద్రశేఖర్ బుధవారం పలు బాలల సంరక్షణ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలోనే స్థానిక శిశు గృహ, నందికొట్కూరు రోడ్డులోని మెర్సీ హోంలోని పిల్లలకు అందిస్తున్న ఆహారం, నివాసం, విద్య, ఆరోగ్య సేవలు, మానసిక స్థితిగతులను కమిటీ సభ్యులు పరిశీలించారు. అలాగే సిబ్బంది పనితీరు, రికార్డుల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, సదుపాయాలను మెరుగుపరచుకునేందుకు అవసరమైన సహకారాన్ని జిల్లా అధికార యంత్రాంగం ద్వారా అందజేస్తామన్నారు. కార్యక్రమంలో శిశు గృహ మేనేజర్ మెహతాజ్, మెర్సీ హోం సిస్టర్స్ మేరీ సిరి, సారంగా, పద్మ తదితరులు పాల్గొన్నారు.


