రిషికాంత్ టౌన్‌షిప్‌లో దొంగల హల్‌చల్
కర్నూలు: నగర శివారులోని నంద్యాల రోడ్డులో ఉన్న రిషికాంత్ టౌన్‌షిప్ (శిల్ప టౌన్‌షిప్ పక్కన) లో దొంగలు హల్‌చల్ చేశారు. ఈనెల 20వ తేదీ తెల్లవారుజామున ముగ్గురు వ్యక్తులు ఫ్లాట్ నెం.9లో నివసించే శ్రీకాంత్‌రెడ్డి ఇంట్లోకి ప్రవేశించి ప్రధాన ద్వారం వద్ద ఉన్న సీసీ కెమెరాకు గుడ్డలు చుట్టి తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. మొదట ఫ్లాట్ కింద ఉన్న కార్యాలయంలోకి వెళ్లి రూ.10 వేలు నగదు, ల్యాప్‌టాప్‌ను తస్కరించారు. ఇంట్లోకి వెళ్లేటప్పుడు సెన్సర్ బల్బులను గుర్తించి వాటిని తొలగించి పగలగొట్టి హల్‌చల్ చేశారు. ముఖానికి మాస్కులు, మంకీ క్యాపులు ధరించి చేతులకు గ్లౌజులు వేసుకుని ముగ్గురు దొంగలు ఇంట్లోకి చొరబడినట్లు మరో సీసీ కెమెరా ఫుటేజీలో నమోదైంది. అదే వెంచర్‌లో నివాసముంటున్న కోనా రెడ్డి ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన ద్విచక్ర వాహనాన్ని కూడా దొంగలు చోరీ చేశారు. ఈ వెంచర్ ఏర్పాటై 6 ఏళ్లు పూర్తయినప్పటికీ ఇప్పటివరకు కాంపౌండ్ వాల్ నిర్మించకపోవడం వల్ల తరచూ కాలనీలో దొంగలు ప్రవేశించి చేతివాటం ప్రదర్శిస్తున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం సమీప కాలనీ స్కందాన్షిలో కూడా దొంగలు భారీగా నగలు, నగదు చోరీ చేశారు.
మద్యం బాబులకు అడ్డాగా...
నూతనంగా ఏర్పాటైన ఈ కాలనీలు మద్యం బాబులకు అడ్డాగా మారాయి. నగర శివారు కావడంతో రాత్రివేళల్లో మద్యం బాబులు ఈ ప్రాంతాల్లో తిష్ట వేసి అర్ధరాత్రి వరకు మద్యం తాగుతుంటారు. ఇదే కాలనీలో ఇద్దరు పోలీసు అధికారులు నివాసముండగా మరో ఇద్దరు అధికారులు సొంతంగా ఇల్లు నిర్మించుకుంటున్నారు. తరచూ పోలీసు వాహనాలు కాలనీలో తిరుగుతున్నప్పటికీ దొంగలు అదును చూసి ఇళ్లల్లోకి చొరబడుతున్నారు. పోలీసు గస్తీ అంతంతమాత్రంగా ఉండటంతో దొంగలకు అవకాశంగా మారింది. చోరీ విషయం తెలిసిన వెంటనే కర్నూలు అర్బన్ తాలూకా సీఐ తేజమూర్తి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
రిషికాంత్ టౌన్‌షిప్‌లో దొంగల హల్‌చల్


