ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం
కర్నూలు టౌన్: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను విరమించుకునేంత వరకు ప్రజల పక్షాన పోరాటం ఆగబోదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. ఈనెల 28న జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు, నిరసనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజా వ్యతిరేకతను ప్రభుత్వానికి తెలియజేసేందుకే ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. వైద్య కళాశాలలను ప్రైవేటీకరించకూడదంటూ కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్‌లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ప్రజా ఉద్యమం పోస్టర్లను ఆవిష్కరించారు.
అన్ని రంగాల్లో వైఫల్యం
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలలను చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రెవేటు వ్యక్తులు అమ్మేందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తోందన్నారు. రూ.10 వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ వైద్య కళాశాలలను తమ అనయూయులకు అప్పగించేందుకే పీపీపీ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారన్నారు. ప్రైవేటీకరణ చేస్తే పేద రోగులకు ఉచిత వైద్యం అందుతుందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ కళాశాలల్లో ఒక్కొక్క మెడికల్ సీటు రూ.1.50 కోట్లు అమ్ముకునేందుకు కుట్రలు పన్నారని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న కోటి సంతకాల సేకరణను అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు.
ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడం దారుణం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్యాన్ని కూటమి ప్రభుత్వం అమ్మేందుకు సిద్ధమైందన్నారు. వివిధ రోగాలతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. అయితే ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోవడం దారుణమన్నారు. పేదలంటే గిట్టని విధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, బీసీ సెల్ అధ్యక్షులు బోయ రాఘవేంద్ర నాయుడు, కిషన్, కార్పొరేటర్లు షేక్ అహమ్మద్, షాషావలీ, మైనార్టీ నాయకులు ఫిరోజ్, వైఎస్సార్‌సీపీ నాయకులు లాజరస్, గద్దె రాజశేఖర్ పాల్గొన్నారు.
వైద్యకళాశాలల ప్రైవేటీకరణను
విరమించుకునేంత వరకు ఉద్యమం
ఈనెల 28న ప్రతి నియోజకవర్గంలో
ర్యాలీలు, నిరసనలు
పోస్టర్లను ఆవిష్కరించిన పార్టీ జిల్లా
అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి


