పూర్తి స్థాయిలో నీటిని వినియోగించుకోవాలి
● జిల్లాలోని అన్ని చెరువులు,
ఎస్‌ఎస్ ట్యాంకులను నింపండి
● ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను
ఆదేశించిన జిల్లా కలెక్టర్
కర్నూలు(సెంట్రల్): తుంగభద్ర నీటి కేటాయింపుల్లో జిల్లా వాటాను సమర్థవంతంగా వినియోగించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో మైనర్ ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిసెంబర్ 15 తరువాత తుంగభద్ర డ్యామ్ గేట్ల మరమ్మతులు పనులు చేపడుతుండడంతో పూర్తిస్థాయిలో నీటి వాటాను వినియోగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్యామ్ ద్వారా రావాల్సిన 5 టీఎంసీలు, ఎల్‌ఎల్‌సీ ద్వారా రావాల్సిన 5 టీఎంసీల నీటిని వినియోగించి జిల్లాలోని అన్ని చెరువులు, ఎస్‌ఎస్‌ట్యాంకులను నింపాలన్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో మొత్తం 35 ఎస్‌ఎస్ ట్యాంకులు, 67 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు(చెరువులు) ఉన్నాయని, వాటిని ఏ సమయానికి పూర్తి స్థాయిలో నీటిని నింపుతారో తగు నివేదికలను అందజేయాలని ఆదేశించారు. ఆదోని ఎస్‌ఎస్ ట్యాంకుకు జరుగుతున్న మరమ్మతులు వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
‘భూమాత రక్షణ’ రైతుకు ఎంతో మేలు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భూమాత రక్షణ కార్యక్రమం రైతులకు ఎంతో మేలు చేస్తోందని జిల్లా కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్‌లోని తన చాంబరులో జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘భూమాత’ పథకంలో భాగంగా జిల్లాలో అత్యధికంగా ఎరువులను వినియోగించే 100 గ్రామాలను ఎంపిక చేసుకొని రైతులకు అవగాహన కల్పించాలన్నా రు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్నారు.
కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్
అందుబాటులో టోల్ ఫ్రీ నంబర్ 18004254299
ప్రభుత్వ ప్రాధాన్యత సంక్షేమ పథకాల అమలు కోసం 24 గంటలపాటు పనిచేసే ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్‌ను గురువారం ఆమె సందర్శించారు. అక్కడ పనిచేసే సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందజేశారు. ప్రజలు టోల్‌ఫ్రీ నంబర్ 18004254299కు ఫోన్ చేసి తమ సమస్యలను చెప్పవచ్చు. కార్యక్రమాల్లో జేసీ నూరుల్ కమర్, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, సెట్కూరు సీఈఓ వేణుగోపాల్, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి పీఎల్ వరలక్ష్మీ, ఇరిగేషన్ ఎస్‌ఈ బాలచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


