సాక్షి, అమరావతి: కర్నూలు చిన్నటేకూరు సమీపంలో వేమూరి కావేరి ట్రావెల్స్ అగ్నిప్రమాదానికి గురైన ఘటనలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. బస్సు ప్రమాదానికి సంబంధించిన మరో కొత్త కోణాన్ని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా గుర్తించాయి. బస్సు లగేజీ క్యాబిన్‌లో వందల సంఖ్యలో మొబైల్ ఫోన్లు పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగి, భారీ ప్రాణ నష్టానికి దారితీసిందని ఫోరెన్సిక్ టీమ్స్ తెలిపాయి.
వివరాల ప్రకారం.. ఫోరెన్సిక్ బృందాలు శుక్రవారం ఉదయం ఘటనాస్థలాన్ని, దగ్ధమైన బస్సును పరిశీలించాయి. ఈ క్రమంలో బస్సులో మొబైల్ ఫోన్లను తరలించినట్టు గుర్తించాయి. ‘ప్రమాదం సందర్భంగా ట్రావెల్స్ బస్సు.. బైకును ఢీకొట్టగానే దాని ఆయిల్ ట్యాంక్ మూత ఊడిపడి అందులోని పెట్రోల్ కారడం మొదలైంది. అదే సమయంలో బస్సు కింది భాగంలో బైక్ ఇరుక్కుపోవడంతో, దాన్ని బస్సు కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంలో మంటలు ప్రారంభమయ్యాయి. ఇవి తొలుత లగేజీ క్యాబిన్‌కు అంటుకున్నాయి. అందులోనే 400కు పైగా మొబైల్ ఫోన్లతో కూడిన పార్సిల్ ఉండటంతో అధిక వేడికి ఆ ఫోన్ల బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలాయి.

బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలడం వల్లే భారీ శబ్దం వచ్చింది. ఆ మంటలు లగేజీ క్యాబిన్ పై భాగంలోని ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌కు వ్యాపించాయి. దీంతో లగేజీ క్యాబిన్‌కు సరిగ్గా పైన ఉండే సీట్లలో, బెర్తుల్లో ఉన్న వారికి తప్పించుకునే సమయం లేకుండా పోయింది. అందువల్లే బస్సు మొదటి భాగంలోని సీట్లు, బెర్తుల్లో ఉన్నవారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు. అప్పటికే బస్సు దట్టమైన పొగ, మంటల్లో చిక్కుకుంది. బస్సు లోపల చిక్కుకున్న ప్రయాణికులు తప్పించుకునేందుకు యత్నించినా.. కుడివైపునున్న అత్యవసర ద్వారం తెరుచుకోకపోవడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు’ అధికారులు తెలిపారు. మంటలు చెలరేగిన వెంటనే డ్రైవర్ బస్సును నిలిపి అతని సీటు పక్కన ఉండే కిటికీ డోరు నుంచి దిగి వెనక వైపునకు వెళ్లి చూసి అక్కడి నుంచి పారిపోయాడు అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కర్నూలు ప్రమాద ఘటనలో తీవ్రత పెరగడానికి మొబైల్ ఫోన్ల పేలుడే కారణమని ప్రాథమికంగా తేలింది.

పార్సెల్ ఆఫీసుల్లో పోలీసులు తనిఖీలు?
ఈ ప్రమాదంలో ఫోన్లు పేలడం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ పార్సిల్ ఆఫీసుల్లో.. ఆర్టీవో అధికారులు గానీ, పోలీసులు తనిఖీలు నిర్వహించే అవకాశం ఉంది. ఇలాంటి పేలుడు పదార్థాలకు ప్రధాన కారణంగా ఉన్నటువంటి మొబైల్ ఫోన్లను, సంబంధిత ఇతర వస్తువులను గాని బస్సులలో పంపించకూడదని ఇప్పటికైనా అధికారులు హెచ్చరించే అవకాశం ఏమైనా వుందా? చూడాల్సి ఉంది.


